ఎంపీల ఖర్చు తగ్గించే భవనాలు ఇవే

ఎంపీల ఖర్చు తగ్గించే భవనాలు ఇవే

అత్యాధునిక హంగులతో ఢిల్లీలో 36 డూప్లెక్స్‌ ఫ్లాట్లు

కొత్త ఎంపీల ‘హోటల్​ ఖర్చులు’ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని నార్త్​ అవెన్యూ ప్రాంతంలో అత్యాధునిక బంగళాలను నిర్మించింది. సకల సౌకర్యాలతో 36 ఫ్లాట్లను కట్టించింది. కొత్త ఎంపీలకు వాటిని కేటాయించనుంది. ఇప్పటిదాకా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైవ్​స్టార్​ హోటళ్లలో బస చేస్తున్నారు. ఆ ఖర్చును తగ్గించే పనిలో భాగంగానే సెంట్రల్​ పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్​ (సీపీడబ్ల్యూడీ) ఈ 36 డూప్లెక్స్​ బంగళాలను కట్టించినట్టు చెబుతున్నారు. పర్యావరణ హితంగా ఉండే భవనాలు భూకంపాలనూ తట్టుకుని నిలబడతాయి. ప్రతి అపార్ట్​మెంట్​ బ్లాక్​లో రెండు ఫ్లోర్లుంటాయి. ఉన్నది రెండు ఫ్లోర్లే అయినా లిఫ్ట్​ సౌకర్యాన్ని కల్పించారు.

రాష్ట్రపతి భవన్​ కనిపించేలా అందమైన వ్యూతో డిజైన్​ చేశారు. ఒక్కొక్క ఫ్లాట్​లో నాలుగు బెడ్​రూంలుంటాయి. వంటింటినీ అందంగా తీర్చిదిద్దారు. ఫ్లోర్​ను గ్రానైట్​ మార్బుల్స్​తో వేశారు. సెంట్రలైజ్డ్​ ఏసీ పెట్టించారు. పనోళ్ల కోసం ఓ చిన్నపాటి రూంనూ కట్టించారు. బేస్​మెంట్​లో పార్కింగ్​ సౌకర్యం కల్పించారు. దేవుళ్లకు పూజ చేసుకునేలా చిన్నపాటి ‘టెంపుల్​’నూ ఏర్పాటు ఏశారు. కరెంట్​ బిల్లును తగ్గించే పనిలో భాగంగా పైకప్పుపై సోలార్​ పానెళ్లను ఏర్పాటు చేశారు. కరెంట్​ దుబారా కాకుండా వాటంతట అవే ఆన్​ అయ్యి ఆఫ్​ అయ్యే సెన్సర్​ లైట్లను పెట్టారు. అంటే మనుషులు ఎంటరైనప్పుడు ఆన్​ అవుతాయి. లేనప్పుడు బంద్​ అవుతాయి. స్పీకర్​ సుమిత్రా మహాజన్​ నేతృత్వంలో భేటీ అయిన లోక్​సభ సెక్రటేరియట్​ ఈ మేరకు ఆయా ఫ్లాట్లను ఎంపీలకు కేటాయించాలని నిర్ణయించారు.

ఫైవ్​స్టార్​ హోటళ్లలో ఎంపీలు పెడుతున్న లక్షల రూపాయల ఖర్చును తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చారు. కొత్త ఎంపీలకు ఇళ్లు కేటాయించేదాకా వారి వారి రాష్ట్రాల గెస్ట్​ హౌస్​లు లేదా కొత్తగా రిపేర్లు చేయించిన ప్రభుత్వ అధీనంలోని వెస్టర్న్​ కోర్టుల్లో వసతి కల్పించాలని నిర్ణయించారు. 2014లో దాదాపు 300 మంది ఎంపీలు 15 రోజుల నుంచి 3 నెలల పాటు హోటళ్లలో ఉండడం వల్ల కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని లోక్​సభ సెక్రటేరియట్​ అధికారి ఒకరు చెప్పారు.