వేలాది స్మారక నాణేలతో దుర్గా పండల్

వేలాది స్మారక నాణేలతో దుర్గా పండల్

దసరా పండుగ సందర్భంగా కోల్‌కతాలో ప్రతి యేడూ ప్రతిష్టాత్మకంగా జరిపే దుర్గాపూజకు సర్వం సిద్ధమైంది. అందుకోసం గత కొన్ని రోజుల నుంచి బాబుబాగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక ప్రత్యేకతతో భక్తులను ఆకర్షిస్తున్న దుర్గా మాత ఆలయ మండపం ఈ సారి మరింత అట్రాక్షన్ గా నిలవనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి నాణేలతో భక్తులకు స్వాగతం చెప్పేవిధంగా నిర్వాహకులు మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి విడుదల చేసిన వేలాది స్మారక నాణేలతో డిజైన్ చేశారు. ఇందులో 1947కి చెందిన కాయిన్ ను మధ్యలో ఉంచి, మిగతా అన్ని కాయిన్స్ ను దానికి ఇరువైపులా ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ నాణేలపై మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద లాంటి ప్రముఖుల చిత్రాలున్నాయి.

ఈ కాన్సెప్ట్ రూపకర్త సుజాతా గుప్తా అనే డిజైనర్ మాట్లాడుతూ.... ఈ జనరేషన్ వాళ్లకు అప్పటి నాణేల గురించి తెలిసి ఉండదని, ఒకవేళ తెలిసినా అవి ఎలా ఉంటాయో చూసి ఉండకపోవచ్చని చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్లకు, ఇప్పటి వాళ్లకు తెలిసేలా ఆనాడు స్మారక నాణేలు ఎలా ఉండేవో చెప్పే ఉద్దేశంతోనే ఇలా డిజైన్ చేశామని స్పష్టం చేశారు. వీటన్నింటినీ ఒక మ్యూజియంగా ఈ దుర్గా పండల్ ఆవరణలోనే ఉంచామని చెప్పుకొచ్చారు. దీన్నంతటినీ పూర్తిచేయడానికి తమకు దాదాపుగా 2నెలలు పట్టిందని తెలిపారు. వీటి కోసం 30నుంచి 40 లక్షల ఖర్చయిందన్నారు. ఇదిలా ఉండగా ఈ దుర్గా పూజ ఉత్సవాలను బాబుబాగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ కమిటీ నిర్వహించడం ఇది 61వసారి.