‘కరోనాసుర మర్ధిని’గా దుర్గమ్మ.. వైరస్‌‌‌ థీమ్‌‌‌‌‌తో విగ్రహాల తయారీ

‘కరోనాసుర మర్ధిని’గా దుర్గమ్మ.. వైరస్‌‌‌ థీమ్‌‌‌‌‌తో విగ్రహాల తయారీ

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో దుర్గ పూజలను వైభవంగా జరుపుకుంటారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ యేడు ఉత్సవాల నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుర్గ పూజల విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దుర్గ పూజలకు సంబంధించిన ఓ విషయం ఇంట్రెస్టింగ్‌‌‌గా ఉంది. సాధారణంగా ప్రతి సంవత్సరం దుర్గ పూజల్లో మహిషాసుర మర్ధినిగా అమ్మవారు కనిపిస్తారు. కానీ కరోనా కారణంగా ఈసారి కరోనాసుర మర్ధినిగా దేవి కనిపించనున్నారు. దుర్గ విగ్రహాల తయారీకి కోల్‌‌కతాలో ప్రసిద్ధి చెందిన కుమర్తులి ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి తమను దుర్గా దేవి కాపాడుతోందని తాము నమ్ముతున్నామని, అందుకే అమ్మ వారిని కరోనాసురను అంతమొందించే శక్తిగా చూపించబోతున్నామని విగ్రహ రూపకర్తలు చెప్పారు. కొందరు తయారీదారులు మహిషాసురుడి తలను కరోనా వైరస్‌‌గా రూపొందిస్తుండటం గమనార్హం.

విగ్రహాల తయారీకి కుమర్తులి చాలా ఫేమస్. ఈ కాలనీలో దాదాపు 500 మంది చేతి వృత్తుల వారు ఉంటారు. మహమ్మారి కారణంగా ఈ యేడు వారి బిజినెస్ పై చాలా ప్రభావం పడింది. గతేడాది 4,500 విగ్రహాలు తయారు చేసిన కుమర్తులికి ఈ సంవత్సరం కేవలం 2,200 ఆర్డర్లు మాత్రమే వచ్చాయని కుమర్తులి మృతషిల్పి అసోసియేషన్ తెలిపింది. ఈ ఏడాది విగ్రహ తయారీలో కరోనా మహమ్మారి, లాక్‌‌‌‌‌డౌన్ అంశాలను విగ్రహ రూపకర్తలు హైలైట్‌‌ చేస్తున్నారు. కొందరు తయారీదారులు మైగ్రంట్ వర్కర్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను విగ్రహ తయారీ ద్వారా చెప్పే యత్నం చేస్తున్నారు.