సీఎం కేసీఆర్ కు యువ రైతు ప్రశ్నల వర్షం

సీఎం కేసీఆర్ కు యువ రైతు ప్రశ్నల వర్షం

జగిత్యాల: కేసీఆర్ పై ఓ యువ రైతు విరుచుకుపడ్డాడు. ప్రశ్నలు వర్షం గుప్పిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే... మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన యువరైతు దుర్శెట్టి కిరణ్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓడిపోతాననే భయం కేసీఆర్ లో మొదలైందని అందులో చెప్పాడు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన తీరు అందుకు నిదర్శనమని స్పష్టం చేశాడు. ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు కేంద్రం మీటర్లు పెడితే తనకొచ్చే నష్టమేందని కేసీఆర్ ను నిలదీశాడు. రాజకీయాల కోసమే మోటర్లు.. మీటర్లు అని కేసీఆర్ అంటున్నాడని మండిపడ్డాడు. రాజకీయాలు పక్కన పెట్టి విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇప్పటి వరకు స్కూల్ పిల్లలకు బుక్కులు, డ్రెస్సులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, వాళ్లకు నాణ్యమైన ఆహారం ఎందుకు అందజేయడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించాడు.

స్కూల్ పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టే సీఎం వాళ్ల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. వీఆర్ఏల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదో సీఎం చెప్పాలన్నాడు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా కేసీఆర్ రాజకీయాల గురించి మాత్రమే పట్టించుకుంటున్నాడని పైర్ అయ్యాడు. ఇప్పటికైనా స్కూల్ పిల్లల సమస్యలు పట్టించుకోవాలని, వాళ్లకి నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశాడు.