బ్లడ్‌‌  బ్యాంకుల్లో తగ్గుతున్న రక్తం నిల్వలు

బ్లడ్‌‌  బ్యాంకుల్లో తగ్గుతున్న రక్తం నిల్వలు
  • హాస్పిటల్​కి రాకముందే ఫోన్​లో బేరం
  • డబ్బులు తీసుకొని హ్యాండిస్తున్న మోసగాళ్లు
  • ఒక్కొక్కరి నుంచి వెయ్యి, రెండు వేలు వసూలు
  • రక్తం అవసరం ఉన్నవారే టార్గెట్​గా నయా దందా

హైదరాబాద్  నిమ్స్​లో ట్రీట్ మెంట్ పొందుతున్న ఓ పేషెంట్ కి రక్తం అవసరం ఉండడంతో  అతని కుటుంబ సభ్యులు రక్తం కావాలంటూ ఈ నెల 8న సోషల్ మీడియాలో పెట్టారు. బ్లడ్  కోసం ఏర్పాటు చేసుకున్న ఆయా వాట్సాప్ గ్రూప్ లలో ఈ మెసేజ్ వెళ్లింది. బ్లడ్  డొనేట్  చేస్తానంటూ 9న ఓ వ్యక్తి  పేషెంట్ కుటుంబ సభ్యులకు ఫోన్  చేశాడు. తాను అల్వాల్ లో ఉంటానని, ట్రావెలింగ్  చార్జీలు ఇవ్వాలని అడిగాడు. క్యాబ్  చార్జీల వరకు ఇస్తామని  చెప్పడంతో ఆ వ్యక్తి నిమ్స్ కి వెళ్లాడు. రక్తదానానికి సంబంధించిన ప్రాసెస్​ అంతా పూర్తయ్యాక మెడికల్ హెల్త్ చాట్ సమయంలో తాను ట్యాటూ వేసుకున్నానని తెలిపాడు. దీంతో బ్లడ్ తీసుకోలేదు. ట్యాటూ వేసుకుంటే ఆరు నెలల వరకూ బ్లడ్  తీసుకోరన్న విషయం తనకు తెలియదని, సారీ బ్రదర్ అంటూ  డోనర్  చెప్పాడు. అనంతరం అతనికి ట్రావెలింగ్  చార్జీల కింద పేషెంట్  తరపు వారు రూ.800 ఇచ్చారు. అతను వారికి మళ్లీ కాల్ చేసి ‘‘క్యాబ్  చార్జీలు ఎక్కువయ్యాయి. ఇంకో రూ.250 ఇవ్వాలి” అని డిమాండ్ చేశాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన బాధితులు అతని నంబర్  బ్లాక్ చేశారు.     

హైదరాబాద్, వెలుగు: ఆపదలో ఉన్నవారికి రక్తం ఇస్తామంటూ కొందరు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. కొండంత బాధలో ఉన్న పేషెంట్ కుటుంబ సభ్యులను బ్లడ్  పేరుతో మోసం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. రక్తం కావాల్సిన వారికి బ్లడ్  డొనేట్  చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేస్తున్న వాట్సాప్ గ్రూప్ లలో మోసగాళ్లు చేరుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఫోన్ చేయడం, రక్తం ఇచ్చేందుకు వస్తున్నానని, అందుకు చార్జీలు ఇవ్వాలని అడగడం, తీరా బాధితుల వద్దకు వెళ్లాక తాను ట్యాటూ వేసుకున్నానని, ఇటీవల సర్జరీ జరిగిందని వంటి సాకులు చెప్పి డబ్బు తీసుకొని వెళ్తున్నారు. ఇలా ఒక్కో మోసగాడు రోజూ ఇద్దరు, ముగ్గురిని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.  హైదరాబాద్ నగరంలో రోజూ వేల మందికి రక్తం అవసరం ఉంటుంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు రక్తదాతలు దొరకడం లేదు. ఈ పరిస్థితిని మోసగాళ్లు క్యాష్  చేసుకుంటున్నారు. 

బ్లడ్​ షార్టేజ్​తో డిమాండ్

బ్లడ్‌‌  బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. ట్రీట్ మెంట్ కోసం వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచీ హైదరాబాద్ కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సిటీలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ, చిన్న, పెద్ద సర్జరీలు కలిపి రోజూ 3 వేల వరకు జరుగుతున్నాయి. వాటిలో మైనర్ సర్జరీలకు తప్ప మిగతా అన్నింటికీ రక్తం అవసరం ఉంటుంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఇప్పుడు బ్లడ్  బ్యాంకులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనాకు ముందు 174  బ్లడ్​ బ్యాంకులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 274కి పెరిగింది. గ్రేటర్  హైదరాబాద్ లో ప్రస్తుతం వందకి పైగా బ్లడ్  బ్యాంకులు ఉన్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌‌  బ్యాంకులో అన్ని రకాల గ్రూప్​లకు సంబంధించి150  నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అవసరం ఉన్నవారికి రక్తం అందిస్తుంటారు. ఇది కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్‌‌  బ్యాంకులకు రక్తం సమకూరుతుంది. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరించి సరఫరా చేస్తుంటాయి. అలాగే ప్రముఖ ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శిబిరాలు నిర్వహించి, రక్తం సేకరించి ఇస్తుంటారు. అయితే కరోనా తరువాత చాలా సంస్థలు శిబిరాలు నిర్వహించడం తగ్గించాయి. గతంలో ఐటీ ఉద్యోగులు కూడా రక్తదానం చేసేవారు. అయితే ఐటీ కంపెనీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటుండటంతో ఇంకా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. 

సోషల్​ మీడియాపైనే భరోసా

హైదరాబాద్ లో బ్లడ్​ డొనేషన్​కి సంబంధించి పదివేలకు పైగా వాట్సాప్​ గ్రూపులున్నాయి. అయితే కరోనా కారణంగా చాలా గ్రూపులు యాక్టివ్ గా ఉండడం లేదు. ఇప్పుడు ఎన్ని గ్రూపులలో పోస్టు చేసినా డోనర్​ వస్తాడన్న నమ్మకం లేదు. గతంలో రెగ్యులర్ గా రక్తదానం చేసేవారిలో ప్రస్తుతం 30 శాతం మంది మాత్రమే బ్లడ్  ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. రక్తదాతల కోసం వేరే మార్గం లేకపోవడంతో గ్రూప్ లలో రిక్వెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇలా డిమాండ్ ఉండడంతో మోసగాళ్లు కూడా ఆ గ్రూప్ లలో చేరి మోసాలకు పాల్పడుతున్నారు.

నిజమైన డోనర్ డబ్బు తీసుకోడు

నిజమైన బ్లడ్  డోనర్  డబ్బు తీసుకోడు. ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలన్న తపన తప్ప అతను ఏమీ ఆశించడు. అవతలి వ్యక్తి  డబ్బు అడుగుతున్నాడంటే మోసం చేస్తున్నాడని గ్రహించాలి. అటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలి.  

- బంటి ముందగడ, బీయింగ్  హ్యూమన్ ఏక్ ఉమీద్ ఫౌండర్

డబ్బు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి

రక్తదానం చేసేందుకు డబ్బు అడుగుతున్న వారిని నమ్మొద్దు. ఎవరైనా డబ్బు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాంటి మోసాలు జరుగుతున్నాయని ఇటీవలే మా దృష్టికి వచ్చింది. ఆన్ లైన్​లో డబ్బు వేయించుకొని ఫోన్లు స్విచ్చాఫ్  చేస్తున్నట్టు తెలిసింది. 

- ఎల్.లక్ష్మీ రెడ్డి, ప్రెసిడెంట్, వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్