ఈ–కామర్స్​ కంపెనీలు.. రేట్లు పెంచి డిస్కౌంట్లు ఇస్తున్నాయ్

ఈ–కామర్స్​ కంపెనీలు.. రేట్లు పెంచి డిస్కౌంట్లు ఇస్తున్నాయ్

న్యూఢిల్లీ: వస్తువుల రేట్లను పెంచేసి, ఆ తర్వాత వాటిపై ఆన్​లైన్​ బిజినెస్​ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయని, ఇలాంటి పద్ధతులపై రెగ్యులేటరీ ఏజన్సీలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కట్స్​ ఇంటర్నేషనల్​ ఒక రిపోర్టులో వెల్లడించింది. ఈ–కామర్స్​కంపెనీల ఈ పద్ధతి వల్ల నిజానికి కస్టమర్లు మోసపోతున్నారని పేర్కొంది. ఎక్కువ రేట్లు చూపించి డిస్కౌంట్లు ఇవ్వడంతో తాము ఆదా చేస్తున్నామనే ధోరణికి కస్టమర్లు వస్తున్నారని వివరించింది. 

ఫ్లాష్​సేల్స్​పై గంపగుత్తగా నిషేధం విధించడం వంటి చర్యలు కాకుండా, కన్జూమర్ల పరిరక్షణ పై రెగ్యులేటరీ ఏజన్సీలు ఫోకస్​ పెట్టాలని కట్స్​ ఇంటర్నేషనల్​ సూచించింది. మార్కెట్లో అందరికీ సమానమైన అవకాశాలు ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పేర్కొంది. రేట్లను పెంచేసి, భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న ఈ–కామర్స్​ సెక్టార్​పై ప్రభుత్వం లేదా సంబంధిత రెగ్యులేటరీ ఏజన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని కట్స్​ ఇంటర్నేషనల్​ తన రిపోర్టులో కోరింది. ఈ–కామర్స్​ కంపెనీలు పాటిస్తున్న ఈ పద్ధతి అనైతికమైనదని వెల్లడించింది. 

స్టేటస్​ ఆఫ్​ ఈ–కామర్స్​ ఇన్​ ఇండియా పేరుతో కట్స్​ ఇంటర్నేషనల్​ ఈ రిపోర్టును రిలీజ్​ చేసింది. నిలకడైన ఈ–కామర్స్​ ఎకోసిస్టమ్​ ప్రమోట్​ చేసేందుకు ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ సెల్లల్లర్లు ఉండాలని చెబుతూ, కానీ లాభాల మార్జిన్లు తగ్గించేసుకుని ఆర్థికంగా దివాలా తీసేలా తక్కువ రేట్లకు అమ్మకూడదని రిపోర్టు సూచించింది. 

డీప్​ డిస్కౌంటింగ్​, ప్రెడేటరీ ప్రైసింగ్​ల మధ్య తేడా ఏమిటనే అంశంపై క్లారిఫికేషన్​ ఆవశ్యకమని అభిప్రాయపడింది. దేశంలోని ప్రజలకు అర్థమయ్యేలా కంటెంట్​, ఇంటర్​ఫేస్​లను రీజినల్​లాంగ్వేజ్​లోనూ ఆన్​లైన్​ రిటైల్​ ప్లేయర్లు అందుబాటులోకి తేవడం అవసరమని స్పష్టం చేసింది.