వెలుగు కవిత: ఈ-అంగడి.. అదో దుకాణం కాదు
ఈ-అంగడి..అదో దుకాణం కాదు
అక్కడ సరుకులేమీ లేవు
ఓనరు ఎవరో తెలియదు
అయినా స్మార్ట్ ప్రపంచమంతా..
ఈ-– అంగట్లోనే మునిగి ఉంది
వేల మాల్స్ దీని ముందు దిగదుడుపే
స్మార్ట్‌ఫోన్ తలుపు తాళం తీసి..
ఈ-అంగడి డోర్ తెరవగానే..
కుప్పలు తెప్పలుగా అమ్మే వస్తువులు !
అక్కడ దొరకనిది ఏదీ లేదు
కూడు, గూడు, గుడ్డలు..
చీమలు, దోమలు, పురుగులు..
బల్లులు, పిల్లులు, కుక్కలు..
పిడకలు, పేడ, తలలో పేళ్లు..
చెట్లు, పుట్టలు, గుట్టలు..
బావిలో కప్పలు, ఆలుచిప్పలు
అంతరిక్షంలో అగ్గువకే స్థలాలు…
చంద్రమండలంపై ప్లాట్లు..
భూమిలో దాగిన నిధి నిక్షేపాలు …
అద్దె సంసారానికి అమ్మాయిలు..
అగ్గువకే అద్దెకు ఆలి, మగాడు..
కిరాయికి దయ్యాలు, భూతాలు..
అద్దె గర్భాలు, కాల్ గర్ల్స్..
అన్నీ సరసమైన ధరలకే !
ఇది ఓ మాయా ప్రపంచం
ఈ-డిజిటల్ అంగట్లో..
కొనే వాడుంటే..
భూగోళాన్నే నీ పేర రాసిస్తారు
సౌరమండలాన్ని రిజిస్టర్ చేస్తారు !
జర జాగ్రత్త నేస్తం
నీకు తెలియకుండానే..
నిన్ను కూడా అమ్మేస్తుంది
మాయదారి ఈ - కలికాలం అంగడి !
- మధుపాళీ
