ముందస్తు ఎన్నికలు అన్నిసార్లు గట్టెక్కిస్తయా?

ముందస్తు ఎన్నికలు అన్నిసార్లు గట్టెక్కిస్తయా?

భారతదేశంలో కాశ్మీర్ మినహా, ప్రతి రాష్ట్ర అసెంబ్లీ, దేశ పార్లమెంటుకు 5 సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. పాలనా కాలం పూర్తి కావడానికి ఇంకా సమయం ఉండగానే, ఓ అస్థిరతను సృష్టించి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా దాన్ని మళ్లీ పొందాలనుకున్నప్పుడు వివిధ మార్గాలను అన్వేషిస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతున్న క్రమంలో, ప్రత్యర్థులను గందరగోళానికి గురి చేయడం ద్వారా తమకు మేలు జరుగుతుందనుకున్నప్పుడు పాలకులు ముందస్తు ఎన్నికలకు వెళ్తారు. కానీ తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున నిధులు, మానవ వనరులు, సమయం వృథా అవుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఇది అంత మంచిది కాదు. 1945లో బ్రిటన్​ ప్రపంచంలోనే నెంబర్​వన్ శక్తిమంతమైన దేశం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చీటికి మాటికి ఎన్నికలు, పార్లమెంట్​రద్దు, ఉప ఎన్నికలు లాంటి విధానాలు దేశ రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతిశాయి.. తీస్తున్నాయి. రవి అస్తమించని బ్రిటీష్‌‌ సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలపై ఒకప్పుడు పెత్తనం చలాయించిన బ్రిటన్‌‌ ఇప్పుడు సొంత ఇంటినే చక్కదిద్దుకోలేక చతికిలపడిపోతున్నది. మొన్నటిదాకా రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడింది. నాలుగు నెలల కాలంలో ఇద్దరు ప్రధానులు, నలుగురు ఆర్థిక మంత్రులు, ముగ్గురు హోంశాఖ మంత్రులు పదవులను వీడాల్సి వచ్చింది. 

 

  • ముందస్తుకు వెళ్తే కలిసొచ్చే అంశాలు


కేసీఆర్​మరో రెండు మూడు నెలల్లో కర్నాటకతోపాటే ముందస్తు ఎన్నికలకు వెళ్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్​ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ప్రతిపక్షాలు సిద్ధంగా లేవనుకుంటున్న ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే కొంత ప్రయోజనం ఉంటుంది. రోజూ కనిపించే తమ నేత ముఖం చూడటానికి ప్రజలకు కొంత బోర్​కొడుతుంది. తెలిసిన ముఖంతో వారు ఒకింత విసుగు చెందుతారు. అందుకే యూఎస్ఏ, అభివృద్ధి చెందిన దేశాల్లో నాయకులు వారి ఇమేజ్​ను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దగ్గర కేసీఆర్​హైపర్​యాక్టివ్. మీడియాలో, సభలు, సమావేశాల్లో ఎప్పుడూ కనించే ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఓవర్​ఎక్స్​పోజర్​ కేసీఆర్​కు కొంత ఇబ్బంది అని అనుకుంటే.. ముందస్తుకు వెళ్లడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. ఇదీగాక చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారని, టైమ్​ కలిసి వస్తే జంప్ అవుతారని కేసీఆర్‌‌కు కూడా తెలుసు. అందుకే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన హామీపైనా అనుమానం వ్యక్తం చేసే ఎమ్మెల్యేలు లేకపోరు. అలాంటి వారి నుంచి పార్టీకి ఇబ్బందులు రావొచ్చు. ముందస్తు ఎన్నికలు ఫిరాయింపులకు అడ్డుకట్ట వేస్తాయి.


మారిన రాజకీయ పరిస్థితులు

 

గత నాలుగేండ్లుగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు బాగా మారాయి. ప్రతిపక్షాలు గతంతో పోలిస్తే బలపడ్డాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లు గత ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు పడిన ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తున్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాలు లేని ఏకాభిప్రాయ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలిప్పుడు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్​ రెండు ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్​తో పోటీ పడనున్నాయి. అయితే సిద్ధాంత పరంగా బీజేపీ, కాంగ్రెస్​ఎప్పుడూ కలవకపోవచ్చు. ఈ రెండు పార్టీల నేతలు పరస్పరం ప్రత్యర్థులు అయినప్పటికీ, వారి కార్యకర్తలు ప్రత్యర్థులు కారు. చాలా మంది కాంగ్రెస్​నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సహజంగానే కాంగ్రెస్ కార్యకర్తలకు వారి పట్ల సానుభూతి ఉంటుంది. టీఆర్‌‌ఎస్‌‌ను ఓడించేందుకు బలమైన ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేయాలని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గట్టిగా నిర్ణయించుకుంటే కేసీఆర్‌‌ ఆట ముగిసినట్లే!. బీజేపీకి మొదటి శత్రువు కేసీఆర్. కాంగ్రెస్‌‌కు మొదటి శత్రువు కేసీఆర్‌‌. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు రెండు పార్టీల కార్యకర్తలు నిశ్శబ్దంగా కలవడం కేసీఆర్‌‌కు పెను ప్రమాదకరం. ‘ఐదేండ్లు పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయగలరా? ఇది డబ్బు, సమయం చాలా వృథా కాదా?’  అని ఏ ఓటరో, ఎమ్మెల్యేనో కోర్టుకు వెళ్లొచ్చు. చట్టసభలను ముందుగానే రద్దు చేసే ‘ఇంగ్లిస్​ స్టైల్​ఆఫ్​ పాలిటిక్స్’ను కోర్టులు పరీక్షించలేదు. ఎన్నికలంటే భయపడుతున్నారని ఎదుటి పార్టీ వారు అంటారని ఏ రాజకీయ పార్టీ కేసులు పెట్టేందుకు ముందుకు రావు. న్యాయస్థానాల్లో ముందస్తు ఎన్నికలను చేపట్టగలిగేది ప్రజలే. అయితే అందుకు వివేకం కలిగిన ఓటర్లు అవసరం.

అన్ని సార్లు విజయం సాధ్యమేనా!


భారతదేశంలో పాలనా కాలానికి ముందే అసెంబ్లీలను రద్దు చేయడం చాలా అరుదు. 2018లో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. షెడ్యూల్​ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2019 మే నెలలో జరగాలి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను అప్పటి జనరల్​ఎలక్షన్స్​తో కలిపి నిర్వహించాలని కేసీఆర్ అనుకోలేదు. నరేంద్ర మోడీకి ప్రజాకర్షణ ఉందని, ఓటర్లు మోడీకి ఓటు వేయవచ్చని ఆయన గ్రహించారు. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ ముందస్తు మాట వినిపిస్తున్నది. నిజంగా కేసీఆర్​ ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. రాష్ట్ర ప్రజల మూడ్​గురించి ఆయన ఆందోళన చెందుతున్నట్లు అర్థం. ముందస్తు ఎన్నికలు అన్ని సార్లు కలిసి రావు. 1971లో ఇందిరాగాంధీ పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1989లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి 6 నెలల సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004లో వాజ్‌‌పేయి లోక్‌‌సభ గడువుకు 8 నెలల ముందే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. తెలివైన రాజకీయ నాయకులు కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు 
తీసుకుంటారు. 

ముందస్తుకు వెళ్తే కలిగే నష్టాలు


అసెంబ్లీని రద్దు చేసి ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలకు వెళ్తారో, ‘కేసీఆర్​కు ఎన్నికలంటే భయం.. చివరి వరకు ఉంటే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంద’నే ముందస్తుకు వెళ్లినట్లు ప్రజలకు ఓ సందేశం వెళ్తుంది. దాని వల్ల ఎన్నికల్లో నష్టం జరగొచ్చు. పైగా ఇటీవలి ఉప ఎన్నికలోనూ ప్రజా వ్యతిరేకత కనిపించింది. గత అనుభవాల దృష్ట్యా ప్రతిపక్షాలు కేసీఆర్​ముందస్తు ఎత్తుగడను చూసి ఖంగుతింటాయని అనుకోవడానికి లేదు. 2004 జనవరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి వాజ్​పేయి ఎలా విఫలమయ్యారో కేసీఆర్ గుర్తుంచుకోవాలి. కేసీఆర్​ హామీ ఇచ్చి నెరవేర్చని హామీలు ఉన్నాయి. సొంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ సాయం, నిరుద్యోగ భృతి లాంటివి. ఒక్కసారి ఎన్నికలు ప్రకటిస్తే ప్రభుత్వం వాటికి సంబంధించి ఏమీ చేయలేకపోతోంది. రెండో టర్మ్​లో ముందస్తుకు వెళ్లినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. తెలంగాణ నిర్మాణం కోసం ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పుడు తెలంగాణ అంశం పనిచేయకపోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌‌ఎస్‌‌కు ప్రతి సీటుకు నలుగురు మంచి ఆశావహులు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టిక్కెట్లు నిరాకరించిన వారి ఆగ్రహం బయటకు వస్తుంది. గుజరాత్‌‌లో బీజేపీకి కూడా రెబల్స్ నుంచి ఇలాంటి వ్యతిరేకతే ఎదురవుతున్నది.

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్