భూ తగాదాలతోనే బంధువు హత్య..నిందితుడిని అరెస్ట్ చేసిన గజ్వేల్ రూరల్ పోలీసులు

భూ తగాదాలతోనే బంధువు హత్య..నిందితుడిని అరెస్ట్ చేసిన గజ్వేల్ రూరల్ పోలీసులు
  • మీడియాకు వివరాలు తెలిపిన సీఐ మహేందర్ రెడ్డి

గజ్వేల్​, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ ​మండలం వేలూరులో రెండు రోజుల కింద జరిగిన రైతు హత్య కేసును పోలీసులు చేధించారు. బంధువే నిందితుడని తేల్చారు. సోమవారం గజ్వేల్​రూరల్​ సీఐ మహేందర్ రెడ్డి ప్రెస్​మీట్ లో వివరాలు వెల్లడించారు. గత శనివారం సాయంత్రం వేలూర్ గ్రామానికి చెందిన రాయన్న నర్సయ్య(65) గ్రామ శివారులో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసి గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.

గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఎంక్వైరీ చేశారు.  నర్సయ్యకు వరుసకు కొడుకయ్యే చింతకింది రాజు(39)ను అదుపులోకి తీసుకుని విచారించారు.  దీంతో తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. రాజుకు నర్సయ్య వరుసకు పెదనాన్న అవుతాడు.  ఇరువురి మధ్య కొన్నాళ్లుగా భూ తగాదాలు నెలకొన్నాయి.  ఇదే క్రమంలో ఈనెల 5న రాజు తన పొలంలో వరి నాటు వేసేందుకు గట్లు చెక్కుతున్నాడు.

నర్సయ్య వెళ్లి తన పొలంలో పచ్చ గడ్డి ఎందుకు వేశావని గొడవకు దిగాడు. నర్సయ్య బూతులు తిట్టడంతో తీవ్ర కోపంతో చేతిలోని వడ్డెపారతో దాడి చేసి చంపేసినట్టు రాజు ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్టు పోలీసులు తెలిపారు.  కేసును చాక చక్యంగా చేధించి రెండు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.