నెలకు రూ.లక్షా 70వేల సంపాదన.. చేతినిండా జీతం, పైకి చూస్తే కార్పొరేట్ ఉద్యోగాలతో హ్యాపీగా సాగిపోయే లైఫ్‌లా కనిపిస్తుంది. కానీ నెలాఖరు వచ్చేసరికి వాళ్ల అకౌంట్‌లో మిగులుతోంది జస్ట్ రూ.2వేల 520 మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నేటి తరం యంగ్ కపుల్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి ఇది. 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కపుల్ తాము సంపాదిస్తున్నా నెలాఖరుకు రూపాయి మిగలక, పే-చెక్ టు పే-చెక్ బతుకు బతుకుతున్నామంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
నెలకి లక్షల్లో సంపాదిస్తున్నా జీతం ఖర్చులకే సరిపోతోంది, మానసికంగా తీవ్రంగా అలసిపోయాం, మమ్మల్ని కాపాడే సలహా ఇవ్వండి అంటూ సదరు భర్త పెట్టిన ఈ పోస్ట్ మిడిల్ క్లాస్ EMIల ట్రాప్‌ను కళ్లకు కట్టింది. 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంటలో భర్త రూ.లక్షా 2వేలు, భార్య రూ. 68 వేలు ఇంటికి తెస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకుని లెక్కలు వేసుకుంటే వారికి మైండ్ బ్లాంక్ అయింది. తమ సంపాదనలో రూ.85వేల 980 కేవలం EMIలకే పోతోందని వారు వాపోయారు. ఇందులో పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బైక్ లోన్‌తో పాటు చివరకు మొబైల్ ఫోన్ లోన్ కూడా ఉన్నాయట.
ఈ భారీ ఈఎంఐలు కాకుండా ఇంటి అద్దె, మెయింటెనెన్స్, నిత్యావసరాలు, మెడికల్ బిల్లులు, ప్రయాణ ఖర్చుల కోసం నెలకు రూ.53వేల 500 ఖర్చవుతోందని చెప్పారు. వీటికి తోడు పర్సనల్ ఖర్చులు, వీకెండ్ ఎంటర్టైన్మెంట్స్, ఫ్యామిలీ ఎమర్జెన్సీల కోసం మరో రూ.28వేలు కేటాయిస్తున్నట్లు ఆ జంట చెబుతోంది. ఇవన్నీ పోగా నెలాఖరుకు మిగిలేది కేవలం 2 వేల చిల్లర మాత్రమే. ఇలాగైతే సొంత ఇల్లు ఎప్పుడు కొనాలి? పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? రిటైర్మెంట్ కోసం ఏం దాచుకోవాలి? చేతిలో సమయం అయిపోతున్నట్టు అనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యంగ్ కపుల్.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ విలువైన సలహాలు ఇస్తున్నారు. ఖర్చులు ఇక్కడ సమస్య కాదని.. మీరు తీసుకున్న అనవసరపు అప్పులే అసలైన విలన్లని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఫోన్ కొనడానికి కూడా లోన్ తీసుకోవడం చాలా తప్పని.. కొన్ని నెలలు పర్సనల్ ఖర్చులు తగ్గించుకుంటే ఫోన్ డబ్బులు వచ్చేవని ఒకరు చురకలు అంటించారు. మరో నాలుగు నెలల్లో బైక్ లోన్ అయిపోతుందని, ఆ తర్వాత మిగిలే రూ.12 వేలను నేరుగా పర్సనల్ లోన్ ప్రీపేమెంట్ చేసి అప్పుల భారం తగ్గించుకోవాలని, ఆ తర్వాతే మిగతా జీవిత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని నెటిజన్లు సూచించారు. నిజంగా అనవసరపు ఈఎంఐలు కనిపించకుండా చెదపురుగుల్లా ఆర్థిక పరిస్థితిని కుంటుబరుస్తాయని ఈ యంగ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చూస్తే అర్థం అవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
