స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరిన ఈటల

 స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరిన ఈటల

రాజీనామాపై ఈటల దైర్యంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలు తనతో ఉన్నారనే నమ్మకంతోనే ఈటల రాజీనామా చేశారని ఆయన అన్నారు. ఈటల నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అందుకోసం ఈటలతో కలిసి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి బయలుదేరారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అశ్వద్ధామ రెడ్డి, గండ్ర నళిని ఇతర నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ ప్రయాణానికి ముందు వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ‘ఈటల బీజేపీలో చేరుతుండటం శుభపరిణామం. ఆయన చేరికతో బీజేపీ మరింత బలపడుతుంది. ఈటల విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మందిని రాజీనామా చేయించకుండా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాను. అభివృద్ధి చూసే చేరారని అంటున్న కేసీఆర్.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట టీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో చెప్పాలి. టీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళందరూ అసంతృపిగా ఉన్నవాళ్లే. బానిసలుగా అక్కడ ఉంటున్నారు. చేరికలు ఇప్పుడే ప్రారంభమైయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయి. కుటుంబపాలన, నియంతృత్వ పాలనపై వేసారిన నేతల చేరికలు త్వరలోనే ఉంటాయి. ఈటలతో ఢిల్లీ రావాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. దాదాపుగా 200 మంది ఢిల్లీ వస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల గొంతుకోసి.. తన కుటుంబసభ్యులను  అన్ని పదవుల్లో నియమిస్తున్నాడు. నియంతృత్వ పాలనపై ప్రజల పోరాటం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలను.. తప్పుడు ఆరోపణలు చేసి బయటకు పంపారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా.. కేవలం ఈటలపై చర్యలు తీసుకున్నారు’ అని మాజీ ఎంపీ, బీజేపీ కొర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.