హుజురాబాద్‌ నివేదికలు చూస్తేంటే.. కేసీఆర్ దిమ్మ తిరుగుతోంది

హుజురాబాద్‌ నివేదికలు చూస్తేంటే.. కేసీఆర్ దిమ్మ తిరుగుతోంది

హుస్నాబాద్: హుజురాబాద్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మొదటి దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’  ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

‘ఆగస్ట్ 28న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మొదలైన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 36 రోజులపాటు కొనసాగి.. ఈ రోజు హుస్నాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర చేసిన కార్యకర్తలందరికీ నా అభినందనలు. హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలు ఇస్తుంటే... కొంతమంది అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది. హుజురాబాద్ ప్రజానీకం అంతా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. హుజురాబాద్‌లో 75% బీజేపీకి, టీఆర్ఎస్‌కి  25% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే... కేసీఆర్‌కి దిమ్మ తిరుగుతోంది. ఎన్ని దొంగ లెటర్స్ సృష్టించినా... అది వాళ్ళకే తిప్పి కొడుతుంది. నాలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే... అయ్యే పనేనా. హుజురాబాద్ కురుక్షేత్రంలో గెలిచాక... ఆ తర్వాత 33 జిల్లాల్లో కురుక్షేత్రమే. ‘దళిత బంధు’ను 33 జిల్లాలకు అమలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నా. అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలి. బీజేపీని గెలిపించేందుకు 33 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని ఈటల అన్నారు.