కేసీఆర్‌కు ఈటల సవాల్.. టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

కేసీఆర్‌కు ఈటల సవాల్.. టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

కరీంనగర్:  హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా దీవెన యాత్ర నేడు కరీంనగర్ జిల్లా  వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చేరుకుంది. డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో గ్రామస్తులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

2023లో తెలంగాణలో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది

‘నన్ను రాజకీయంగా చంపాలనుకుంటున్నావేమో.. కానీ నేను చావను. మీ పార్టీ 2023లో తెలంగాణ గడ్డమీద అడ్రస్ లేకుండా చేస్తా. శపించడానికి నేను రుషిని కాకపోవచ్చు కానీ.. ప్రజల కళ్లల్లో ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వృద్ధుల తరంకాదు, యువతరం చూస్తోంది. నేను రాజీనామా చేసినప్పటి నుంచి హుజురాబాద్ అట్టుడుకి పోతోంది. ఎన్నడూ కనిపించని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఇండ్లు కిరాయి తీసుకుని ఊర్లకు ఊర్లు బార్లుగా మార్చారు. నన్ను కలిసే వాళ్లపై నిఘా పెట్టి వాళ్ల ఇళ్లలోకి వెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బతిమాలినా వినకపోతే.. భయపెడుతున్నారు. నన్ను కలిసిన  దళితుల ఇంటికి పోలీసులు, నాయకులు వెళ్లి బియ్యం డబ్బాలు, పప్పు డబ్బాలు చెక్ చేస్తున్నారు. కానీ వాళ్లు భయపడుకుండా.. మా ఇండ్ల మీదకు ఎవరు పంపారంటూ మర్లపడ్డారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు. 

నా మంత్రి పదవి అందుకే తీసేశారా?

నాతో తిరిగే వాళ్ల భార్యలు ఆశావర్కర్లుగా, వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. నాతో తిరిగితే వారి భార్యల నౌఖరీ పోతుందని బెదిరిస్తున్నారు. ఇట్లా బెదిరించి, బలవంతంగా తమవైపు తిప్పుకోవాలనుకుంటే కుదురుతుందా? భయంతో కొందరు కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నప్పటికీ... తమ గుండెళ్లో పువ్వు గుర్తును పెట్టుకున్నారు. ఎన్నడూ మీ కష్టాలు చూడని వాళ్లు.. ఇప్పుడు డప్పు చాటింపు వేసి పథకాలు ఇస్తున్నారు. బీజేపీకి మద్ధతు ఇస్తున్న వారి వాడల్లో రోడ్లు వేస్తలేరు. కానీ చెరువు కట్టలపై మాత్రం రోడ్లు వేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇస్తే.. చెడ్డపేరు వచ్చి నేను కొట్టుకుపోతానని భావించారు. కానీ అక్కడ కూడా మంచి పేరు వస్తే వాళ్లు ఓర్వలేకపోయారు. రాజీనామా చేసి కూడా ప్రజలకు ఇన్నిసాధించాడని, గెలిస్తే మరెన్ని సాధిస్తాడోనని నా గురించి బి.ఎస్. రాములు ఆర్టికల్ రాశాడు. ఫామ్ హౌస్‌లో పడుకునే సీఎం.. నేను గెలిస్తే హుజురాబాద్‌కు వచ్చి మీ కోసం నా రక్తం ఉన్నంతవరకు పనిచేస్తానంటడు, జై భీం అంటడు, జై అంబేద్కర్ అంటడు. అలాంటి పరిస్థితి రావాలా వద్దా? నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానంటే తేల్చలేదు. ఇప్పుడు మీరు ముక్కు రాయమంటే.. సమాధానం లేదు. నేను ముఖ్యమంత్రికి ఎసరు పెట్టానని హరీశ్ రావు అంటున్నాడు. నన్ను మంత్రిగా అందుకే తీసేశారా? లేక భూములు ఆక్రమించుకున్నాని తీసేశారా? మీ రెండు నాలుకల ధోరణిలో ఏది కరెక్టో చెప్పాలి. 

మీరు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే సీఎం రాజీనామా చేయాలి

నా పేరుతో ఇప్పటి వరకు మూడూ దొంగ ఉత్తరాలు రాశారు. దళితబంధు ఆపాలని నేను రాసినట్లు ఓ ఉత్తరం సృష్టించారు. అలాంటిదేమీ లేదని ఎన్నికల అధికారి ప్రకటించారు. దళితబంధు అందరికీ ఇవ్వాల్సిందే. వారికి ఆ నగదును స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి. నిరుపేదలందరికీ కులాలకతీతంగా పది లక్షలు ఇవ్వాలి. గతంలో కూడా నేను సీఎంను క్షమించమని ఉత్తరం రాసినట్లు సృష్టించారు. అవసరమైతే చచ్చిపోతా తప్ప.. ఆయనకు లొంగిపోను. దమ్ముంటే..  డబ్బులు, సారా సీసాలు, పోలీసుల దుర్మార్గాలు, అధికారుల దౌర్జన్యాలు పక్కనపెట్టి ధీరుడిలా తలపడు. మీరు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే సీఎం రాజీనామా చేయాలి. వడ్లు కొనేదిలేదన్న కేసీఆర్ వైపు ఉంటారా? కొనాల్సిందేనని చెప్పిన ఈటల వైపు ఉంటారా? సొంత స్థలాలలో ఇండ్లు కట్టుకునే జీవో ఇవ్వాలని అడిగే ఈటల వైపు ఉంటారా? ఏడేళ్లుగా ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని కేసీఆర్ వైపు ఉంటారా? పింఛన్ ఇవ్వనన్నకేసీఆర్ వైపు ఉంటారా? ఇవ్వాలని కోరిన నా వైపు ఉంటారా? నాకు మీపై సంపూర్ణ విశ్వాసం ఉంది. చాలా మంది వృద్ధులు రాజేందర్‌‌కే ఓటేస్తామంటున్నారు. కానీ వాళ్లకు నాగుర్తు తెలియకపోవచ్చు. మీరే పువ్వు గుర్తుని గుర్తు చేసి చెప్పండి. నిన్నటి దాకా నాతో ఉన్న నాయకుడు మరొకరు వెళ్లిపోయారు. ఎవరు ఏ క్షణంలో వెళ్లిపోతారో తెలియడం లేదు. అయినా భయపడను. నాతో మీరున్నారు’ అని ఈటల అన్నారు.

For More News..

విడాకులు కన్ఫర్మ్ చేసిన సామ్ చై

రాంగ్‎రూట్‎లో కేటీఆర్ కారు.. అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్సై