ఓటేసేందుకు ఇక కష్టపడక్కర్లేదు ..

ఓటేసేందుకు ఇక కష్టపడక్కర్లేదు ..
  • గూడేలు, అటవీ ప్రాంతాల్లో ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలు
  • పది మంది ఓటర్లున్న చోటసెంటర్​ ఏర్పాటు
  • తీరనున్న చెంచులు, కోయలు, లంబాడాల కష్టాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా పది సెంటర్ల ఏర్పాటుకు ఈసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్ల కష్టాలు తీర్చేందుకు ఎన్నికల కమిషన్ ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. పది నుంచి ముప్పై మంది ఓటర్లు ఉన్న గూడేలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవాళ్లు ఈ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కొండలు, గుట్టలు, మారుమూల గ్రామాల్లో ఉంటున్న గిరిజనులు ఓటేసేందుకు చాలా ఇబ్బందిపడుతున్నారు. 20 కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్లి ఓటేస్తున్నారు. అలాంటి వారి కోసమే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పది ఆగ్జిలరీ పోలింగ్ బూత్​లను ఈసీ ఏర్పాటు చేస్తున్నది. నాగర్​కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని చెంచులు, కోయలు, లంబాడాల కోసం ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఏడు పోలింగ్ కేంద్రాలు ఒక్క నాగర్​కర్నూల్ సెగ్మెంట్​లోనే ఉండడం విశేషం.

ఆ రెండు చోట్ల పది మందే ఓటర్లు

నాగర్​కర్నూల్ జిల్లాలోని మల్లాపూర్​పెంట, నల్గొండ సెగ్మెంట్​లోని బూడిదగట్టుల్లో కేవలం పది మంది ఓటర్లే ఉన్నారు. మల్లాపూర్​పెంట మారుమూల అటవీ ప్రాంతంలో ఉండటంతో గతంలో అక్కడి నుంచి 20 కిలో మీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. కానీ.. ఈసారి మల్లాపూర్ పెంటలోనే ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు నల్గొండ సెగ్మెంట్​లోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బూడిదగట్టుకు 8 కిలో మీటర్ల దూరంలో పోలింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు బూడిదగట్టులోని అంగన్వాడీ కేంద్రంలో పోలింగ్ బూత్​ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 30 మంది ఓటర్లలోపు ఉన్న మరో 8 చోట్ల ఈ బూత్​లను ఏర్పాటు చేయనున్నారు.

కమ్యూనికేషన్​ కష్టం

మారుమూల అటవీ ప్రాంతాలు కావడంతో కమ్యూనికేషన్ ఉండదు. అందుకే.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు వైర్​లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్​ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో నలుగురు పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసు, వాలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. తాగునీరుతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. మౌలిక వసతుల్లేని చోట్ల గుడిసెలు వేసి పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్నారు. అటవీ ప్రాంతం కావడంతో పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టేందుకు ఆటంకాలు, ఆంక్షలు ఎదురవుతున్నాయి. అందుకే గుడిసెల్లోనే పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.