- నిర్ణయాలపై పునరాలోచన
- ఫారం–6 అదనపు డిక్లరేషన్ తొలగింపు
- అర్హులైన ఓటర్ల చేర్పునకు డ్రైవ్
- ఇంటికే బీఎల్వోలంటూ ఆదేశాలు
- ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన
- అభ్యంతరాలకూ పరిష్కారం
- ఇతర అంశాల్లోనూ సవరణలు
న్యూఢిల్లీ:ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రజా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. ముందుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఈసీ.. తాజాగా ఒక్కో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్లు ఊపందుకోవడంతో ఈసీ తన విధానాలను సరళీకరిస్తూ అనేక మార్పులు చేసింది.
ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై విపక్షాల ఆందోళనలు, ఈసీలో అంతర్గత విభేదాలు బయటపడటం, సీఈసీ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం కావడం వల్లే ఈసీ ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపునకు ఈ ప్రక్రియ కారణమవుతోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన 23 ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి.
సర్ ప్రక్రియలో అదనపు నిబంధనలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు రావడంతో తోటి ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, ఎల్‌జేపీ సైతం ఈసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీంతో పాటు ప్రజల నుంచి తలెత్తిన తీవ్ర వ్యతిరేకత, ప్రజాస్వామ్య రక్షణ పేరిట విపక్షాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో ఎన్నికల సంఘం ఎట్టకేలకు వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చినట్టుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వెనక్కి తీసుకున్న నిర్ణయాలు, సవరణలు ఇవే..
ఫారం-6లో అదనపు డిక్లరేషన్ తొలగింపు
ఎన్నికల జాబితాలలో కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6 అప్లికేషన్‌లో చేర్చిన అదనపు నిబంధనను ఈసీ తొలగించింది. మునుపటి సర్ ప్రక్రియకు సంబంధించిన తమ తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను లింక్ చేయాలనే నిబంధనను, సర్ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలలో ఈసీఐనెట్ యాప్, పోర్టల్ నుంచి అలాగే సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారుల వెబ్‌సైట్ల నుంచి ఈ డిక్లరేషన్‌ను ఇప్పుడు తొలగించారు.
అలాగే సంబంధిత రాష్ట్రాల్లో ఇకపై సాధారణ రిజిస్ట్రేషన్ రూల్స్-1960 ప్రకారమే పాత పద్ధతిలోనే ఫారం-6 దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే, రివిజన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో భాగంగానే కొనసాగుతుంది.
ఇళ్లకు రానున్న బీఎల్‌ఓలు
ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలు లేదా ధ్రువీకరణ లోపాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్లు నేరుగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) కార్యాలయానికి వెళ్లి, తమ వివరాలను అందజేయాల్సి ఉండగా, ఈ నిర్ణయంపైనా ఈసీ వెనక్కి తగ్గింది. ఇకపై ఓటర్లు ఈఆర్‌ఓ కార్యాలయానికి హాజరుకావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. బూత్ లెవెల్ అధికారులే (బీఎల్‌ఓలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరించి, ఆన్‌లైన్ (ఈసీఐనెట్) ద్వారా అప్‌లోడ్ చేస్తారని తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా విచారణ ఉంటుందని పేర్కొంది.
రాజకీయ పార్టీలకు పారదర్శకత
ఓటర్ల జాబితాల్లో పారదర్శకత విషయంలోనూ ఈసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే ముందు, లేదా ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందుబాటులో ఉంచుతారు. తద్వారా ఓటర్ లిస్టుల్లో పారదర్శకత పెంచాలని ఈసీ నిర్ణయించింది.
గోవాలో ఓటర్ల తొలగింపు వివాదం
గోవాలో స్థానిక అధికారులు క్లియర్ చేసిన 97 మంది ఓటర్ల పేర్లు తుది జాబితాలో లేవంటూ మీడియా కథనాలు రావడం కూడా దుమారం రేపింది. దీంతో వారి పేర్లనూ ఎన్నికల జాబితాల్లో చేర్చేలా ఈసీ చర్యలు చేపట్టింది.
కమిషనర్ల ఆందోళనలకూ.. దిద్దుబాట్లు!
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లేవనెత్తిన పలు ఆందోళనలను పరిష్కరిస్తూ ఫారం6లో అదనపు డిక్లరేషన్ తొలగింపు, ఇతర అంశాలతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నది.ఇకపై కమిషన్ ప్రతి సమావేశానికి ముందే ఎజెండా పంపిణీ, భేటీ తరువాత మినిట్స్ జారీ చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది.
అధికారుల విదేశీ పర్యటనలకు కమిషన్ ఆమోదం తప్పనిసరి. కొత్త ఐటీ మాడ్యూల్స్, పోర్టల్స్ కమిషన్ ముందు ఉంచడానికి ముందు అధికారుల కమిటీ పరిశీలనలోకి వెళ్తాయి. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఈసీఐనెట్‌ను సమీక్షిస్తుంది. ఇందులో ఐఐటీ లేదా ఐఐఐటీ నుంచి ఒక స్వతంత్ర నిపుణుడు కూడా ఉంటారు. సిస్టమ్‌లో ఫీల్డ్ అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే కల్పిస్తారు. అలాగే కమిషనర్లు అధికారులకు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి.
అయితే, గత 10 నెలలుగా ఈ ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన ఆందోళనలకు దిద్దుబాటు చర్యలుగా ఈ కొత్త నిర్ణయాలు అచ్చంగా సరిపోతున్నాయి. సమావేశాల్లో ఎజెండాలు పంపిణీ చేయలేదని, మినిట్స్ ఇవ్వలేదని, కమిషన్ అనుమతి లేకుండా అధికారులు విదేశాలకు వెళ్లారని, కమిషన్‌కు తెలియకుండా కొత్త ఐటీ మాడ్యూల్స్ తయారయ్యాయని, ఓటర్ల జాబితా డేటాబేస్‌కు స్వతంత్ర నిపుణుడితో ఆడిట్ జరగాలని, ఈఆర్‌ఓనెట్‌కు ఫీల్డ్ అధికారులకు పూర్తి యాక్సెస్ లేదని, ఐటీ డివిజన్‌కు సంబంధించి పని విభజనను ఒక పరిపాలనా ఉత్తర్వు మార్చివేసిందంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిలోనూ ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం గమనార్హం.
తొలగించిన ఓటర్లను చేర్చేందుకు ‘స్పెషల్ డ్రైవ్’
సర్ ప్రక్రియ పూర్తయిన చోట తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి ఎన్నికల జాబితాల్లో నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని వివిధ రాష్ట్రాల సీఈవోలను ఆదేశించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ సమయంలో ముసాయిదా ఎన్నికల జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల పేర్లను తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈమేరకు దిద్దుబాటు చేపట్టింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మిగిలిపోయిన అర్హులైన ఓటర్లతో పాటు యువత, తొలిసారి ఓటర్లను నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
