
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) యోచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో సర్ అమలు సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు బుధవారం రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల (సీఈవోలు)తో ఈసీఐ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగులో ఓటర్ల జాబితా కచ్చితత్వాన్ని మెరుగుపరచడం, నకిలీ ఓట్ల తొలగింపు, ఓటరు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
సర్ విధానం ద్వారా ఓటర్ల జాబితాను జనన, మరణ రికార్డులతో అనుసంధానం చేసి, ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసే ప్రక్రియపైనా చర్చ జరిగింది. ఈసీఐ సీనియర్ అధికారులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి కూడా తమ రాష్ట్రంలో సర్ విధానం అమలు సందర్భంగా ఎదురైన అనుభవాలను, సవాళ్లను సమావేశంలో పంచుకున్నారు.
2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఈ ఏడాది చివర్లోనే ఆయా రాష్ట్రాల్లో సర్ అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మూడో సీఈవోల సమావేశం. మూడు నెలల్లో నకిలీ ఓట్లను తొలగించాలనే లక్ష్యంతో ఈసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పోల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ కార్డులను తనిఖీ చేస్తారు. తాజా సమావేశం ఓటర్లకు సులభమైన సమాచార స్లిప్‌లు అందించడం, పోలింగ్ కేంద్ర వివరాలను స్పష్టంగా తెలియజేయడం వంటి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడానికి దోహదపడతాయని ఈసీ భావిస్తున్నది.