ఐక్యరాజ్య సమితికి ఆర్థిక కష్టాలు

ఐక్యరాజ్య సమితికి ఆర్థిక కష్టాలు

ప్రపంచ దేశాల వేదిక ఐక్యరాజ్య సమితికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి. అమెరికా, బ్రిటన్ దేశాలు డబ్బులు ఇస్తున్నా ఫలితం ఉండడం లేదు. జీతభత్యాల చెల్లింపులు కూడా భారంగా మారాయి. 23 కోట్ల డాలర్ల లోటు ఉందని, ఈ నెలాఖరుకల్లా నిధులు ఖాళీ అవుతాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితిలో పని చేస్తున్న 37 వేల మంది ఉద్యోగులకు ఆయన సమస్య వివరిస్తూ లేఖ రాశారు. జీతాల చెల్లింపు కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని అందులో తెలిపారు. ఐక్యరాజ్య సమితి బడ్జెట్ మొత్తంలో సభ్యదేశాల నుంచి 70 శాతం నిధులు మాత్రమే వచ్చాయన్న గుటెరస్ .. 23 కోట్ల డాలర్ల కొరత ఉందన్నారు. డబ్బులు లేకపోవడంతో సదస్సులను వాయిదా వేసుకోవడం, ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి పొదుపు చర్యలు పాటించాలని కోరారు. శాంతి పరిరక్షక ఆపరేషన్లకు అయ్యే ఖర్చును మినహాయిస్తే ఐక్యరాజ్య సమితి 2018-19 బడ్జెట్ 5.4 బిలియన్లు. ఇందులో అత్యధిక భాగం అమెరికా ఇస్తోంది.