ఈడీ కస్టడీకి కార్వీ పార్ధసారథి

ఈడీ కస్టడీకి కార్వీ పార్ధసారథి
  • బెంగళూరు జైల్ నుంచి సిటీకి తీసుకొచ్చిన అధికారులు
  • కోర్టు అనుమతితో 5 రోజులు కస్టడీలోకి తీసుకున్న ఈడీ

హైదరాబాద్, వెలుగు: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ చైర్మన్, ఎండీ పార్ధసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. బెంగళూర్‌‌ జైలులో ఉన్న పార్థసారథిని ఈ నెల 19 న పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తరలించింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌కి తరలించింది. కోర్టు అనుమతితో  మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. కాగా, పార్ధసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్ హోల్డర్ల  షేర్లను తనఖా పెట్టి పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి లోన్లను తీసుకొని ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారుల ఫిర్యాదులతో హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు మూడు కేసులు, సైబరాబాద్ పోలీసులు రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసుల ఆధారంగా ఈడీ కేసులు రిజిస్టర్ చేసింది.

మనీ ల్యాండింగ్ పై దర్యాప్తు..

కార్వీ ద్వారా విదేశాలకు మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. సుమారు రూ. 1500 కోట్లు మనీ ల్యాండరింగ్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. గతేడాది సెప్టెంబర్‌‌లో బెంగళూర్‌‌, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌లోని 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. కస్టమర్ల షేర్లను తనఖా పెట్టి లోన్లు తీసుకున్నట్టు గుర్తించింది. బ్యాంక్‌ అకౌంట్స్‌, ప్రాపర్టీలు, విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రూ.2,000 కోట్లు మోసం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన రెండు కేసుల్లో సోమవారం కస్టడీకి తీసుకున్నారు.