
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లోఅవకతవకలు గుర్తింపు
- సెబీ విచారణ ఆధారంగాఈడీ దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ మార్కెటింగ్ సంస్థ బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ (బీజీఎల్)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు ముగిశాయి. స్టాక్ ఎక్స్‌చేంజ్ షేర్స్, ట్రేడింగ్‌లో భారీ అక్రమాలకు పాల్పడ్డారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)గుర్తించిన సంగతి తెలిసిందే. సెబీ ఇచ్చిన సమాచారంతో ఈడీ బుధవారం ఉదయం నుంచి శుక్రవారం వరకు సోదాలు నిర్వహించింది. ఆ వివరాలను శనివారం ప్రకటించింది.హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. కంపెనీ ఆడిటర్ మురళీమోహన్ రెడ్డి ఇంట్లో రూ.3.3 కోట్లు నగదు, రూ.9.3 కోట్ల విలువ చేసే డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, హార్డ్‌డిస్క్‌లు, డిజిటల్ డివైజెస్, డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలిపింది.
షేర్ల ట్రేడింగ్‌లో గోల్‌మాల్..
2020 ఏప్రిల్ నుంచి 2021 ఆగస్టు వరకు కంపెనీ షేర్ల ట్రేడింగ్‌లో కొన్ని సంస్థలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు సెబీ గుర్తించింది. ఇందులో బీజీఎల్ ట్రేడింగ్స్‌ను పరిశీలించగా, విజయ్ కుమార్ కంచర్ల, ఎం.సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్వీ రాజ్యలక్ష్మి రెడ్డి, గీత కంచర్ల బీజీఎల్ స్క్రిప్‌లో బిజినెస్ చేసినట్లు తెలుసుకుంది. ఈ క్రమంలో రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఏడాది జూన్‌లో బ్రైట్‌కామ్ గ్రూప్, ప్రమోటర్లకు రూ.40 లక్షలు జరిమానా విధించింది. చైర్మన్, సీఈవో, ఎండీ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్వీ రాజ్యలక్ష్మి రెడ్డి, బ్రైట్‌కామ్ గ్రూప్‌పై ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గీత కంచర్లకు రూ.12 లక్షలు, విజయ్ కుమార్ కంచర్ల, విజయ్ కుమార్‌పై ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది.