- అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
- రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన “విత్తన బిల్లు 2025” ముసాయిదాపై రాష్ట్ర రైతుల అభిప్రాయాల(రాతపూర్వకంగా)ను సేకరించి ప్రభుత్వానికి అందించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విత్తన బిల్లు ముసాయిదా వివరాలు, అందులో రైతులకు కల్పించిన హక్కులపై రైతులందరికి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
ఇందుకోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ గోపికి ఆదేశాలిచ్చారు. అదే కార్యక్రమంలో మంత్రి తుమ్మల.. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో భాగంగా 16 జిల్లాలకు 50 శాతం సబ్సిడీతో 5,500 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు, పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం వంటి అంశాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాల నిర్వహణపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికలు నిరుపయోగంగా మారాయని ప్రస్తావించిన మంత్రి తుమ్మల.. తమ ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో వాటిని సజీవ వేదికలుగా మార్చిందన్నారు.
ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల రైతులు ఈ వేదికల ద్వారే పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, కమిషన్ సభ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. విత్తన బిల్లు 2025ను మరింత సమగ్రంగా రూపొందించేలా పలు సూచనలు చేశారు.
