
- దేశవ్యాప్తంగా 214 మంది అరెస్ట్
- రాష్ట్రంలో నమోదైన ఆర్థిక నేరాల్లో రూ.915 కోట్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రూ.915 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్, సూర్య డెవలపర్స్, భూదాన్ భూముల స్కామ్ సహా మొత్తం 58 ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) లను ఈడీ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు 49 కేసుల్లో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ (చార్జిషీటు) దాఖలు చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల్లో ఆయా రాష్ట్రాల జోన్ల ఈడీ రూ.30,036.41 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
దేశవ్యాప్తంగా 2,631 సైబర్ కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీ లాండరింగ్, హవాలా సహా సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 214 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో రూ18.37 కోట్లను జప్తు చేశారు. ఇందుకు సంబంధించి కోర్టులు 34 మందికి జైలుశిక్ష విధించాయి. అలాగే, బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ భారీగా మోసాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకు మోసాలకు సంబంధించిన 1,228 మనీ లాండరింగ్ కేసులను ఈడీ దర్యాప్తు చేసింది.
రూ.23,258 కోట్లకు పైగా బ్యాంకులకు తిరిగి అప్పగించింది. సాధారణంగా రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు జాతీయ బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకుంటుంటారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌లు, లాభనష్టాలను తప్పుగా చూపడం, నిధుల మళ్లింపు వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి హై-ప్రొఫైల్ కేసుల్లో సంబంధిత బ్యాంకు అధికారుల అక్రమాలు కూడా ఈడీ దర్యాప్తులో బయపడుతున్నాయి. ఇందులో అధిక శాతం మోసాలు 2014 తర్వాత వెలుగులోకి వచ్చాయి.
సైబర్ నేరాల్లో 5,964 కోట్లు ఆస్తులు అటాచ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన 122 సైబర్ క్రైం కేసుల్లో రూ.20,462 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఇందులో రూ.5,964 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 96 మందిని అరెస్టు చేసి 58 ప్రాసిక్యూషన్ కంప్లయింట్లు (చార్జిషీట్ల) ను ఆయా ప్రత్యేక కోర్టుల్లో దాఖలు చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో నమోదైన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుల వివరాలు సేకరించింది.