అగ్రిగోల్డ్‌‌‌‌ కేసులో ఈడీ చార్జ్​షీట్‌‌‌‌

అగ్రిగోల్డ్‌‌‌‌ కేసులో ఈడీ చార్జ్​షీట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు :  రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌లో పెట్టుబడుల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ అగ్రిగోల్డ్‌‌‌‌ స్కామ్‌‌‌‌ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) బుధవారం చార్జ్​షీట్‌‌‌‌ దాఖలు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్‌‌‌‌ కోర్టులో ఫైనల్ చార్జ్​షీట్‌‌‌‌ ఫైల్ చేసింది. ప్రమోటర్లు అవ్వా వెంకటరామారావు, ఏవీ శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్​ను ప్రధాన నిందితులుగా పేర్కొంది. అగ్రిగోల్డ్‌‌‌‌ ఫామ్‌‌‌‌ ఎస్టేట్స్‌‌‌‌కు చెందిన 11 అనుబంధ కంపె నీలు సహా మొత్తం 27 మందిపై అభియోగాలు మోపింది. ఈడీ చార్జ్​షీట్‌‌‌‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. నిందితులు, కంపెనీల డైరెక్టర్లను అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

8 రాష్ట్రాల్లో డిపాజిట్ల సేకరణ

అగ్రిగోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా డిపాజిట్లు సేకరించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో షెల్‌‌‌‌కంపెనీలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి డిపాజిట్లు సేకరించింది. ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ 32 లక్షల మందికిపైగా ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన డబ్బును షెల్‌‌‌‌కంపెనీలు, బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసింది. డిపాజిటర్ల వద్ద సేకరించిన డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేసింది.

 దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 2015లో ఏపీలోని వెస్ట్‌‌‌‌ గోదావరి జిల్లా పెదపాడు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో మొదటి ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు అయ్యింది. ఆ తరువాత కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూ రు, కర్నాటకలో వరుసగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద ఈడీ కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి రూ.4,141 కోట్ల  ఆస్తులు అటాచ్‌‌‌‌ చేసింది.