రానాకు రెండోసారి ఈడీ నోటీస్.. ఆగస్ట్ 11న విచారణకు రావాలని ఆదేశం

రానాకు రెండోసారి ఈడీ నోటీస్.. ఆగస్ట్ 11న విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రానాకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో సారి నోటీస్ జారీ చేసింది. 2025, ఆగస్ట్ 11న తమ ముందు విచారణకు హాజరు కావాలని తాజా నోటీస్‎లో ఆదేశించింది. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌‌‌‌ చేసిన సెలబ్రిటీలను విచారించేందుకు ఈడీ షెడ్యూల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌, విజయ్‌‌‌‌ దేవరకొండ, మంచులక్ష్మికి  జులై 21న సమన్లు జారీ చేసింది. జులై  23న రానా దగ్గుబాటి, 30న ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌, ఆగస్టు 6న విజయ్‌‌‌‌ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 

ALSO READ | Vijay Deverakonda: డెంగ్యూ నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ.. 'కింగ్ డమ్' ప్రమోషన్స్‌కు రౌడీ స్టార్ రెడీ !

పాన్‌‌‌‌కార్డు సహా బ్యాంక్ లావాదేవీలు, లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల జూలై 23న విచారణకు హాజరు కాలేనని.. కొంత సమయం కావాలని రానా ఈడీని అభ్యర్థించారు. రానా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈడీ.. 2025, ఆగస్ట్ 11న విచారణకు హాజరు కావాలని కొత్త తేదీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం (జూలై 23) రెండో సారి సమన్లు పంపింది. మరీ ఈ సారైనా రానా విచారణకు హాజరు అవుతారో లేదా చూడాలి. 

కాగా, ప్రభుత్వం నిషేధించిన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల  ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. 

పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాలని ఈడీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే నిందితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్ యాక్టర్లకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.