
7 హిల్స్ మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ యాజమాని అభిషేక్ ఆవుల ఈడీ విచారణ ముగిసింది. అధికారులు దాదాపు 9 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. గుట్కా కేసులో తనను విచారించారని.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అభిషేక్ చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రస్తావన రాలేదని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురించి సైతం ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు.
రోహిత్ రెడ్డి సోదరుడితో జరిపిన లావాదేవీల వివరాలన్నీ ఈడీకి ఇచ్చినట్లు అభిషేక్ తెలిపారు. రోహిత్ రెడ్డి సోదరుడితో ఆర్థిక లావాదేవీలు జరిగాయని అంగీకరించిన ఆయన.. నందకుమార్కు చెందిన హోటల్లో కోటి డెబ్బై లక్షల పెట్టుబడి పెట్టానని అన్నారు. నంద కుమార్ తనను మోసం చేసిన విషయాన్ని ఈడీకి వివరించినట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మరోసారి విచారణకు రమ్మన్నారని తెలిపారు.