చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు : తలసాని సోదరులను 10 గంటలు విచారించిన ఈడీ 

చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు : తలసాని సోదరులను 10 గంటలు విచారించిన ఈడీ 

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.  మంత్రి తలసాని సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ల విచారణ ముగిసింది.  ఉదయం 11 గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు.. దాదాపు 10 గంటల పాటు విచారణ జరిగింది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై వారిని ఈడీ ప్రశ్నించింది. ఫెమా ఉల్లంఘనలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ఎంక్వైరీ చేశారు. క్యాసినో టూర్ల విషయంలో హవాలా చెల్లింపులపై ఆరా తీశారు. విచారణ అనంతరం రాత్రి 9 గంటలకు మంత్రి తలసాని సోదరులు ఇద్దరు మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు. రేపు మరోసారి వారు విచారణ కోసం ఈడీ ఎదుట హాజరుకానున్నారు.  

ఇక ఈడీ లిస్టులో సుమారు వంద మంది క్యాసినో కస్టమర్లు ఉన్నట్లు తెలిసింది. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలను సేకరిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్స్ వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. ఇదే ఇష్యూలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ ఇవాళ నోటీసులు ఇచ్చింది. రేపు, ఎల్లుండి ఈ ఇద్దరిని కూడా విచారించనుంది.

ఇప్పటికే  ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌తో పాటు ఆయన సన్నిహితులను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. అంతకుముందు చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరైన చీకోటి.. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.