సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు ఈ సమన్లు పంపినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. అయితే మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికోసం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోనియా, రాహుల్ పై ఈడీని ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలపై తమకు గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. నోటీసులో పేర్కొన్న తేదీన ఈడీ ముందు సోనియా గాంధీ హాజరవుతారని, కానీ రాహుల్ గాంధీకి కొంత గడువు కావాలని కోరుతూ ఈడీకి లేఖ రాస్తామని ఆయన తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఏంటీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు?

1938లో కాంగ్రెస్ లోని కొంతమందితో కలిసి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ముద్ర వేసుకుంది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. అయితే తీవ్ర నష్టాల కారణంగా 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. ఏజేఎల్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కూడా వైఈఎల్ సొంత చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని  పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. కేవలం రూ.50 లక్షల చెల్లించి ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. 

ఓటమి భయంతోనే ఈడీ నోటీసులు: భట్టి విక్రమార్క

ఓటమి భయంతోనే మోడీ ప్రభుత్వం ఈడీ నోటీసులు జారీ చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీ యాక్టివ్ అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని మోడీ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే భయంతోనే ఈ ఈడీ నోటీసులు అని తెలిపారు. ఈడీ నోటీసులకు కాంగ్రెస్ భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన కుటుంబం గాంధీ కుటుంబమని, దేశం మొత్తం సోనియా, రాహుల్ కు అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తల కోసం...

నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్