
- 19న హాజరు కావాలని ఉత్తర్వులు
- కంపెనీలు, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలివ్వాలని ఆదేశం
- ఐదేండ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో రావాలని సూచన
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మనీ లాండరింగ్ చట్టం కింద శుక్రవారం ఈడీ సమన్లు జారీ చేసింది. 19న హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. అడిషనల్ డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో 12 పేజీలను ఈడీ అధికారులు జారీ చేశారు. రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరి ట ఉన్న కంపెనీలు, వాటికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్ షీట్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. ఐదేండ్లుగా రోహిత్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీకి సమాచారం అందింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈఎస్‌ఐఆర్ 48/2022 నంబర్‌తో కేసు నమోదు చేశారు. వివిధ కంపెనీల అకౌంట్లకు నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు. అందుకే రోహిత్‌తో పాటు ఆయన కుటుం బ సభ్యులను విచారించేందుకు సమన్లు పంపారు.
బెంగళూర్ డ్రగ్స్ కేసులో విచారణగా ప్రచారం
గత ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులోని గోవర్ధనపురం పీఎస్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే రోహిత్ పై ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. బెంగళూరులో జరిగిన ఈవెంట్స్, బర్త్‌డే పార్టీలో రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, రాజకీయ నాయకులు వెళ్లినట్లు గతంలో ప్రచా రం జరిగింది. ఈవెంట్స్‌లో డ్రగ్స్ సప్లయ్ చేసిన ఇద్దరు నైజీరియన్లను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్లను విచారించిన సమయంలో బెంగళూరు, తెలంగాణలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులకు డ్రగ్స్ సరఫరా చేసిన ట్లు తేలింది. నైజీరియన్ల ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే పలువురిని బెంగళూరు ఈడీ విచారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రోహిత్ రెడ్డికీ సమన్లు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈడీ జారీచేసిన సమన్లతో మనీలాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు అని వెల్లడైంది.
సంజయ్‌కి ముందే ఎట్ల తెలుసు?: రోహిత్
ఈడీ తనకు నోటీసులు ఇస్తుందని బండి సంజయ్‌కి ముందే ఎలా తెలుసని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ గుట్టు రట్టు చేశాననే తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ఈడీ నోటీసుల్లో తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. కర్నాటక డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇచ్చారనే ప్రచారం నిజం కాదన్నారు.
ఎనిమిదేండ్ల లెక్కలు చెప్పాలే
కుటుంబ సభ్యులతో పాటు పాన్ కార్డులు, పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్స్ డిటైల్స్ తీసుకురావాలని రోహిత్ ను ఈడీ ఆదేశించింది. ఎనిమిదేండ్లుగా నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలని తెలిపింది. 2021–22 వార్షిక ట్రయల్ బ్యాలెన్స్ ఫైనల్ రిపోర్ట్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. రోహిత్ రెడ్డి బయోడేటాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని తెలిపింది. సోమవారం జరిగే ఈడీ విచారణలో రోహిత్ రెడ్డికి చెందిన కంపెనీలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఆయన ఇచ్చే ఆధారాలతో మరి కొంత మందికి సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.