కేజ్రీవాల్​కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు .. నేడు ఆఫీస్​కు రావాలని ఆదేశం

కేజ్రీవాల్​కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు .. నేడు ఆఫీస్​కు రావాలని ఆదేశం
  • 21న లిక్కర్ స్కామ్​లో విచారణకు హాజరుకావాలన్న అధికారులు
  • ఖండించిన ఆప్ లీడర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం సమన్లు జారీ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) లో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ నెల 18న ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. పీఎంఎల్​ యాక్ట్ కింద కేజ్రీవాల్​పై ఇప్పటికే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.

ఈ కేసులో కేజ్రీవాల్​కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి అని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తాజాగా ఈడీ తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న ఈడీ హెడ్ ఆఫీస్​లో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆప్​ నేతలు ఖండించారు. కేజ్రీవాల్​ ఎన్నికల  ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే మోదీ సర్కారు ఉద్దేశమని మండిపడ్డారు.

కేసు ఏంటో కూడా తెలియదు: మంత్రి అతిశీ

ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన కేసు ఏంటనేది కూడా ఎవరికీ తెలియదని మంత్రి ఆతిశీ మార్లేనా అన్నారు. సీఎం కేజ్రీవాల్​ను అరెస్ట్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్​సభ ఎన్నికల్లో భాగంగా క్యాంపెయిన్​కు వెళ్లకుండా కేజ్రీవాల్​ను అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆప్ కామెంట్లపై బీజేపీ నేతలు స్పందించారు. ఈడీ సమన్లు జారీ చేస్తుంటే.. కేజ్రీవాల్ విచారణకు అటెండ్ 
అవ్వకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.