సర్కారు విద్యను చంపేస్తున్నరు.. స్వరాష్ట్రంలో 4,600 స్కూళ్లు మూత

సర్కారు విద్యను చంపేస్తున్నరు.. స్వరాష్ట్రంలో 4,600 స్కూళ్లు మూత

ఆరు దశాబ్దాల ఆరాటం, అలుపెరగని పోరాటం, ఎందరో బలిదానాలు.. వీటన్నిటి కలబోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ.. ప్రజల రాష్ట్రంగా నిర్బంధాలు లేని ప్రజాస్వామిక రాష్ట్రంగా ఉంటుందని ఆశపడ్డ వారికి నిరాశే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న వేళ ఈ తొమ్మిదేండ్ల కాలంలో సాధించినదేంటి, ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనీ ఒక్కసారి మననం చేసుకుంటే అసలు సంగతి అర్థమైతుంది. పాలకుడిగా కేసీఆర్‌ తరీఖా ఏ విధంగా ఉందో స్పష్టం అవుతుంది. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు అందరికీ ఎన్నో ఆశలు, ఆంకాంక్షలుండేవి. సమైక్య పాలనను ఎదిరించి, ఉద్యమంలో కొట్లాడి గెలిచిన సంబురం ఇంటింటా కనిపించేది. పొరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు, నియామకాలన్నీ మన సొంతమనే ఫీలింగ్‌ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో అటువంటి వాతావరణమే కనిపించడం లేదు. కారణం ఏమిటో ప్రజలకు బోధపడే ఉంటుంది.

స్వరాష్ట్రంలో 4,600 స్కూళ్లు మూత

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ పాలనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరైనా లోపాలు, తప్పులను ఎత్తి చూపితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అది కాదంటే ఇష్టం వచ్చినట్లుగా బురద చల్లి అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి వెనుకాడటంలేదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు కేసీఆర్‌ తన వ్యక్తిగత భావాలను ప్రజలపై రుద్దడం తప్ప, ఎవరికీ న్యాయం చేయలేదు. ప్రజలకు కనీస రాజకీయ స్వేచ్ఛ లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణలో అవినీతిమయమైన కుటుంబ పాలన సాగుతున్నది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి, దానికి విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,600 ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో అమరవీరుల సమాచారం తెలియదని చెప్పి కనీసం వారి కుటుంబాలను కూడా  కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు.

చదువు చెప్పే సార్లేరి?

ఉమ్మడి రాష్ట్రంలో స్కూల్​స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు తెలంగాణ విద్యార్థులు సీట్ల కేటాయింపులో అన్యాయానికి గురయ్యే వారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారే స్థానికులుగా అక్రమ సర్టిఫికెట్స్‌ పొంది ఉన్నత విద్యా సంస్థలలో సీట్లు సంపాదించేవారు. తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన వారికి నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్‌ లాంటి ప్రసిద్ధ సంస్థలలో అవకాశాలు అంతగా దక్కేవి కావు. ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రి, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, జర్నలిజం, సైకాలజీ లాంటి సబ్జెక్ట్​లలో సీట్లు రావటం కష్టంగా ఉండేది. హైదరాబాద్‌లోని ఆంధ్ర విద్యార్థులే ఆ సీట్లలో భర్తీ అయ్యేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించబడ్డాయి. కానీ నేడు విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ పాలకులు ప్రభుత్వ విద్యపై వివక్ష చూపిస్తున్నారు. పెండింగ్​లో ఉన్న రూ.4,500 కోట్ల ఫీజురీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ ఇవ్వడం లేదు. దీంతో అనేకమంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంది.

విద్యా వ్యాపారానికి వెన్ను దన్ను

చాలీచాలని బడ్జెట్ కేటాయింపుల వల్ల తెలంగాణా విద్యారంగ అభివృద్ధి కుంటుపడుతున్నదని విద్యావేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్ని వెంటిలేటర్ పై ఉన్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ లేదు. నిధులు లేవు, మౌలిక సదుపాయాల కల్పన లేదు. మరోవైపు తన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యా వ్యాపారానికి ఊతమిస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరిగినా సర్కార్​నుంచి స్పందన లేదు. ప్రభుత్వ పీజీ, డిగ్రీ, జూనియర్ కాలేజీలు సమస్యలతో  కునారిల్లుతున్నాయి. ప్రభుత్వ అండదండలతో కార్పొరేటు విద్యాసంస్థలు విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాయి.  

నిరాశలో నిరుద్యోగులు

ఉమ్మడి ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో.. రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా అలాగే ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భారీగా ఉన్నా రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో స్టూడెంట్లు, నిరుద్యోగుల్లో అశాంతి, ఆవేదన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీఆర్సీ రిపోర్ట్‌ ప్రకారం 1.91లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే 2018 జులై నాటికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు 12,671 మాత్రమే. 20 వేలకు పైగా టీచర్‌ పోస్టులు,1500 పైగా యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 35 వేలకుపైగా ఉండాల్సిన బోధనేతర సిబ్బందిని నియమించడం ప్రభుత్వాలు ఏండ్ల కిందనే మర్చిపోయాయి. ఇంకా అనేక ప్రభుత్వరంగ సంస్థలలో వేలాది ఖాళీలు ఉన్నాయి. ఖాళీ పోస్టులను నింపటానికి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం నియామకాలు సక్రమంగా చేస్తే సరిపోతుంది. అధికార, ప్రతిపక్ష నాయకులు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. సమస్యలకు కారణం మీరంటే మీరే అని వాదులాడుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించడం లేదు. సమస్యల పరిష్కారం కోసం ఉన్న నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదించి విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై ఒక ఏజెండాతో ముందుకు పోవాలి. ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై మరో ఉద్యమానికి సమాయత్తం కావాలె.

- నామాల ఆజాద్, 
పీడీఎస్​యూ తెలంగాణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి