హైదరాబాద్ శివారుల్లో ఏడుపాయల ఆలయ దొంగ అరెస్ట్

హైదరాబాద్ శివారుల్లో ఏడుపాయల ఆలయ దొంగ అరెస్ట్

మెదక్, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలోని హుండీలో సొత్తు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్ట్​ చేశారు.  ఆ వివరాలను మెదక్ ​ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మంగళవారం ఏఆర్​ హెడ్​క్వార్టర్స్​లో తెలియజేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్​కు చెందిన కె.లక్ష్మారెడ్డి ఈ చోరీ చేశాడన్నారు. ఇతడిని మంగళవారం హైదరాబాద్​శివార్లలోని శంకర్​పల్లి వద్ద అరెస్ట్​ చేశామని చెప్పారు. దోచుకెళ్లిన రూ.2, 86,762 క్యాష్​, ఏడున్నర తులాల గోల్డ్ జ్యువెల్లరీ, 250 గ్రాముల సిల్వర్​ను చిలప్ చేడ్  మండలం శీలంపల్లిలోని ఓ ఇంట్లో దాచిపెట్టగా రికవరీ చేశామన్నారు. అలాగే ఇంతకుముందు హైదరాబాద్​లో దొంగతనం చేసిన ఐదు మొబైల్​ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.  

నాలుగు కేసుల్లో నిందిడుతు
లక్ష్మారెడ్డి మరో మూడు దొంగతనం కేసుల్లో కూడా నిందితుడని ఎస్పీ తెలిపారు. గతేడాది హైదరాబాద్​ శివారులోని కొంపల్లిలో ఏటీఎం పగులగొట్టి చోరీకి యత్నించాడని, అది వర్కవుట్​ కాకపోవడంతో అక్కడే ఓ షట్టర్​తాళం పగులగొట్టి దొంగతనానికి ట్రై చేస్తుండగా పేట్​బషీరాబాద్ పోలీసులు పట్టుకుని జైలుకు పంపారన్నారు. బెయిల్​ మీద బయటకు వచ్చిన తరువాత సైబరాబాద్​ పరిధిలోని చందానగర్​లో ఉన్న బిగ్​ సీ మొబైల్​ షాప్​లో 30 సెల్​ఫోన్లు దొంగిలించి దొరికిపోయాడన్నారు. అప్పుడు 22 మొబైల్స్​రికవరీ చేసి మళ్లీ జైలుకు పంపారన్నారు. తర్వాత కూడా బెయిల్​ మీద బయటకు వచ్చిన లక్ష్మారెడ్డి ఈ నెల 19న పటాన్​చెరులో గడ్డపార కొనుక్కొని ఏడుపాయలకు వచ్చి చోరీ చేశాడన్నారు. అక్కడి నుంచి శీలంపల్లిలోని అత్తగారింటికి వెళ్లి వాషింగ్​మెషీన్​లో దాచిపెట్టాడన్నారు.  

సెల్ ఫోన్ కాల్​డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా..
సీసీ ఫుటేజీలు,  సెల్ ఫోన్ సిగ్నల్స్​ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. చోరీ చేశాక మెదక్- –బాలానగర్ హైవే మీదుగా నర్సాపూర్ వైపు వెళ్లే బస్ లో ఎక్కి కౌడిపల్లిలో దిగి అక్కడి నుంచి ఆటోలో చిలప్ చేడ్ మండలం శీలంపల్లికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సొత్తును అత్త గారింట్లో పెట్టి 20న పటాన్ చెరు వెళ్లి 23న అక్కడి నుంచే శీలంపల్లిలోని భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. నిఘా పెట్టిన పోలీసులు పటాన్ చెరు ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

పోలీసులకు రివార్డులు 
మెదక్​ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో రూరల్​ సీఐ విజయ్, కొల్చారం, పాపన్నపేట, మెదక్​ రూరల్,​ హవేలి ఘనపూర్​ఎస్సైలు సారా శ్రీనివాస్​,​ విజయ్​ నారాయణ్​, కృష్ణారెడ్డి, సంతోష్​ , కానిస్టేబుల్స్​మహేశ్​, విజయ్​, దుర్గాప్రసాద్​, తాహెర్​, నవీన్,​ దస్తయ్య, సాయిబాబా, ప్రశాంత్​ దొంగను పట్టుకోగా వీరికి ఎస్పీ క్యాష్ ​రివార్డులు అందజేశారు.