అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ

అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నెల 9న నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో సభాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల.. నర్సాపూర్, జహీరాబాద్, గజ్వేల్, పఠాన్ చెరు నుంచి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. అయితే జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకుండా సర్పంచులను భయపెడుతున్నారని ఆరోపించారు. 

బెట్లు షాపులతో ఆడపడుచులు ఆగం..
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 40 ఏండ్ల బీజేపీకి పార్టీకి ఇప్పటి వరకు సొంత విమానం లేదని, కేసీఆర్ మాత్రం రూ.270కోట్లు పెట్టి ఫ్లైట్ కొనుగోలు చేశాడని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రతి గ్రామంలో వంద బెల్ట్ షాపులు పెట్టిన ఘనత కేసీఆర్ సొంతమని విమర్శించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.25కోట్లు ఇస్తున్న ముఖ్యమంత్రి.. మద్యం ద్వారా రూ.50కోట్ల ఆదాయం సంపాదిస్తున్నాడని అన్నారు. వెయ్యి నుంచి 1500 జనాభా ఉన్న పల్లెటూళ్లలో 10 నుంచి 15 బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. తాగుడుకు బానిసై 40ఏండ్లకే మగాళ్లు చచ్చిపోతుంటే ఆడపడుచులు ఆగమైపోతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 

బంధువర్గానికి భూములు
దళిత బంధు, గిరిజన బంధు, గొల్లకురుమలకు గొర్రెలతో పాటు అన్ని కలాల్లోని పేదలకు పేదల బంధు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఎకరా కోటి నుంచి రూ.3 కోట్లు పలికే భూములను దళితులు, పేదల నుంచి గుంజుకుంటున్నారని ఆరోపించారు. కంపెనీల పేరుతో కోట్ల విలువైన భూములకు కేవలం రూ.10 లక్షలు ఇచ్చి కేసీఆర్ తన బంధువర్గానికి వాటిని దారాదత్తం చేస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు.