రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంపై అసెంబ్లీ ఎలక్షన్ ఎఫెక్ట్

రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంపై అసెంబ్లీ ఎలక్షన్ ఎఫెక్ట్
  •     నిరుడితో పోలిస్తే వెయ్యి కోట్లు తగ్గిన ఆదాయం
  •     టార్గెట్​కు దూరంగా రిజిస్ట్రేషన్ల రాబడి

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గింది. ఏటేటా పెరుగుతూ వచ్చిన రాబడి.. ఎన్నికల ఏడాదిలో మాత్రం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తీవ్రంగా ఉందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో ఇలాంటి అనిశ్చితి ఉంటుందని వారు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం(2022–-23)లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వ్యవసాయ

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,733 కోట్ల ఆదాయం సమకూరగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023 –-24)లో రూ.9,691 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగకపోగా.. రూ.1,042 కోట్ల మేర తగ్గింది. పార్లమెంట్ ఎన్నికల వరకు రిజిస్ట్రేషన్లు ఇదే స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రూ.50 వేలకు మించి తరలించే అవకాశం లేకపోవడం, అలాగే రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు పంపిణీ కోసం నిల్వ చేస్తుండడం కూడా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. 

ధరణి ద్వారా రూ.1,320 కోట్ల ఆదాయం.. 

గత ఫైనాన్షియల్ ఇయర్ లోని తొమ్మిది నెలలతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం సాగు భూములకు సంబంధించి సుమారు 70 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అయినప్పటికీ ధరణి పోర్టల్ లో నిర్వహించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర లావాదేవీల ద్వారా రూ.1,320 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ రాబడి తక్కువే. అలాగే నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా 2022 –‌‌‌‌-23

ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం రాగా.. ఎన్నికల సంవత్సరంలో ఎప్పుడూ 970 కోట్లు దాటలేదు.  ఎన్నికలయ్యాక డిసెంబర్  నెలలో మాత్రమే రూ.1,080 కోట్ల ఆదాయం వచ్చింది.  గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం సెప్టెంబరులో రూ.10 కోట్లు, అక్టోబర్ లో రూ.32 కోట్లు, నవంబర్ లో రూ.63.39 కోట్ల రాబడి తగ్గింది. 

 రాబడి అంచనాలు తలకిందులు

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని ఏటా పెంచుతూ వస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు టార్గెట్ గా పెట్టుకోగా.. భూముల మార్కెట్ విలువ పెంపు ద్వారా రూ.14,284 కోట్ల ఆదాయాన్ని రాబట్టగలిగింది. గత సర్కార్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కోసం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,500 కోట్లు వస్తుందని అంచనా వేసింది.

కానీ, ఏప్రిల్ నుంచే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. డిసెంబర్ వరకు రూ.9,691 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో నెలకు వెయ్యి కోట్ల చొప్పున వచ్చినా.. ఆదాయం రూ.13 వేల కోట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు.