ముఖం చాటేసిన వానలు..వాడిపోతున్న పత్తి చేన్లు

ముఖం చాటేసిన వానలు..వాడిపోతున్న పత్తి చేన్లు
  •    రెండు నెలలైనా ఎదగని మొక్కలు
  •    ఆగస్టు వచ్చినా మొక్కలకు పట్టని పూత
  •    వారం రోజుల్లో వర్షాలు పడకుంటే చేన్లకు ఎఫెక్ట్​
  •    భారీగా పడిపోనున్న పత్తి దిగుబడులు

మహబూబ్​నగర్, వెలుగు : వర్షాభావ పరిస్థితులు పత్తి పంటను దెబ్బ తీస్తున్నాయి. జూన్​ నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో దాని ఎఫెక్ట్​ పత్తి పంట మీద పడుతోంది. విత్తనాలు చల్లుకొని రెండు నెలలు కావస్తున్నా, మొక్కలు ఆశించినంత ఎదగడం లేదు. మొక్కలన్నీ గిడసబారి పోతున్నాయి. మరో వారం రోజులు వర్షాలు పడుకుంటే చేన్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. మహబూబ్​నగర్​ జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తారు. నిరుడు 98 వేల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో సాగువుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు.

కానీ, వర్షాలు ఆలస్యం కావడంతో లక్ష ఎకరాలకే సాగు పరిమితమైంది. జూన్ మూడో వారం నుంచి రైతులు విత్తనాలు విత్తుకోగా, ఇప్పటికీ చేన్లు ఎదగడం లేదు.పూత దశ నుంచి పత్తి కాయ దశలోకి రావాల్సి ఉంది. కానీ, ఇంత వరకు చాలా చోట్ల చేన్లకు పూత కూడా పట్టలేదు. మొక్కలు ఫీటున్నర కూడా పెరగలేదు. మొక్కలు ఎదగడానికి ఈ తరుణంలో ఎరువులు చల్లుకోవాల్సి ఉన్నా, వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గనున్న దిగుబడి..

టైంకు వానలు పడి ఉంటే, పత్తి చేన్లు ఇప్పుడు కాయ దశలో ఉండేవి. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే మొక్కలకు పూత వస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే, పత్తి దిగుబడిపై ఎఫెక్ట్​ పడనుంది. ఒక్కో మొక్కకు 50 నుంచి 70 పత్తి కాయలు పట్టే అవకాశం ఉండగా, మొక్క ఎదగక పోవడంతో 20 కాయలు కూడా పట్టే చాన్స్​ లేదని అంటున్నారు. పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

మిగిలిన పంటలూ అంతే..

వర్షాధారంగా సాగవుతున్న మక్కలు, జొన్న, కంది పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సరైన వర్షాలు లేకపోవడంతో మక్క, కంది చేన్లు ఎదగడం లేదు. కంది పంట సరిగా ఎదగకపోవడంతో హన్వాడ మండలంలో కొద్ది రోజుల కింద రైతులు చేన్లను దున్నేశారు. వరి సాగు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇంకా చాలా మండలాల్లో రైతులు ఇప్పుడు తకాలు పోసుకుంటున్నారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3.23 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగువుతున్నాయి. 

యూరియా స్ప్రే చేసుకోవాలి..

ప్రస్తుతం వాడిపోతున్న చేన్లను కాపాడుకోవడానికి 1.5 గ్రాముల యూరియా లీటరు నీటిలో కలుపుకొని స్ర్పే చేసుకోవాలని డీఏవో వెంకటేశ్వర్లు సూచించారు. ఇలా చేయడం వల్ల 15 రోజుల పాటు చేన్లను కాపాడుకోవచ్చని చెప్పారు. మొక్క కూడా ఎండిపోకుండా పచ్చగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేవని రైతులు యూరియా, పొటాష్​ చల్లుకోవద్దని సూచించారు. ఇలా చేస్తే పంటలు త్వరగా ఎండిపోతాయని చెప్పారు.

మిత్తికి తెచ్చి పత్తి పెట్టిన.. 

రెండు ఎకరాల్లో పత్తి వేశా. మొక్కలు ఎదగట్లేదు. ఆకులు వాడిపోతున్నాయి. పూత పట్టాల్సిన టైంలో వర్షం పడడం లేదు. ఇప్పటికే రూ.50 వేలు మిత్తీలకు తెచ్చి పెట్టుబడి పెట్టిన. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే అప్పుల నుంచి బయటపడొచ్చు.

- దుబ్బ రాంచంద్రయ్య, పెద్దాదిరాల, జడ్చర్ల మండలం

రెండు నెలలైనా పూత రాలే..

నాకున్న మూడెకరాల్లో పత్తి వేసిన. రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు కాయ పట్టాలి. కానీ, ఇప్పటి దాకా పూత కూడా రాలే. వర్షంపై ఆధారపడి వేసుకున్న మూడు ఎకరాలకు రూ.60 వేలకు పైనే ఖర్చయింది. పంట దిగుబడి వస్తదో?  లేదో?  డౌట్​గా ఉంది. 

- చాకలి రాజు, కురుమూర్తి గ్రామం, చిన్నచింతకుంట మండలం