తుఫాన్ ఎఫెక్ట్..డిసెంబర్ 5,6 న భారీ వర్షాలు

తుఫాన్ ఎఫెక్ట్..డిసెంబర్ 5,6 న భారీ వర్షాలు
  • మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
  • అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌‌ ప్రభావం తెలంగాణపై పడింది. ఈ ఎఫెక్ట్‌‌తో రాష్ట్రంలో సోమవారం నుంచే వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సుమారు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం నాటితో పోలిస్తే, బుధవారం కొంత తక్కువ స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆ రోజు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: రైల్వే జీఎం

తుఫాన్ కారణంగా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్ నిలయంలో సోమవారం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయా డిపోల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సైక్లోన్ రూట్​ను పరిశీలించాలని సూచించారు. ఎన్​డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ట్రాక్​లపై మాన్సూన్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రమాదకరమైన వంతెనలు, గేట్ల వద్ద స్టేషనరీ వాచ్​మెన్​లను ఏర్పాటు చేయాలన్నారు. అండర్ బ్రిడ్జిల్లో నీళ్లు నిండితే తోడేసేందుకు మోటార్లు ఏర్పాటు చేశామన్నారు.