ఈజీఎస్​ ఉద్యోగుల  కల నెరవేరేనా .. 18 ఏండ్లుగా కాంట్రాక్ట్​ ఉద్యోగులుగానే సిబ్బంది

ఈజీఎస్​ ఉద్యోగుల  కల నెరవేరేనా .. 18 ఏండ్లుగా కాంట్రాక్ట్​ ఉద్యోగులుగానే సిబ్బంది
  • రెగ్యులరైజేషన్ కోసం15,463 మంది ఎదురుచూపు
  • జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్
  • ప్రస్తుత సర్కారుపైనే కోటి ఆశలు 

మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్  ప్రభుత్వంపై ఈజీఎస్​ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న తమ డిమాండ్​ గత ప్రభుత్వ హయాంలో నెరవేరలేదని, కొత్త ప్రభుత్వమైనా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తుందని ఆశిస్తున్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఉపాధి ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ఫైల్  ఆర్థిక శాఖకు వెళ్లగా.. అంతలోనే ఎలక్షన్  కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉపాధి ఉద్యోగులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్  పార్టీ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై ఆశతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ ప్రజావాణిలో మంత్రి సీతక్కకి వినతిపత్రాలు సమర్పించారు. 

18 ఏళ్లయినా కాంట్రాక్ట్​ ఉద్యోగులుగానే

గ్రామీణ ప్రాంత కూలీలకు ఉన్న ఊర్లోనే ఉపాధి కల్పించే తమకు ఉద్యోగ భద్రత లేకపోవడంపై ఈజీఎస్  ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక అభివృద్ధి పనులలో తాము కీలక పాత్ర పోషిస్తున్నా, శ్రమకు తగిన ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. తమకు పేస్కేల్​ అమలు చేయాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను కాంట్రాక్ట్​ పద్ధతిలో నియమించింది. ఈ స్కీం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 18 ఏళ్లుగా కాంట్రాక్ట్  విధానంలో వారు పనిచేస్తున్నారు. అన్ని జిల్లాల్లో అడిషనల్​ ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇంజనీరింగ్​ కన్సల్టెంట్లు, ఫీల్డ్​ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్​ ఆపరేటర్​ అండ్​ అకౌంట్​ అసిస్టెంట్, ప్లాంటేషన్​ మేనేజర్, ప్లాంటేషన్​ సూపర్​వైజర్, హెచ్ఆర్ మేనేజర్, అసిస్టెంట్  ప్రాజెక్ట్​ డైరెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, స్టేట్​ ప్రోగ్రాం మేనేజర్, ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​ మేనేజర్, ఈజీఎస్​ ప్రోగ్రాం మేనేజర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్​ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, కోర్సు డైరెక్టర్, జూనియర్​ అసిస్టెంట్ తదితర పోస్టులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,463 మంది పనిచేస్తున్నారు.​​

వారిలో ఏపీఓలు 396 మంది, ఇంజనీరింగ్​ కన్సల్టెంట్లు 356, టెక్నికల్​ అసిస్టెంట్లు 2,072 మంది, కంప్యూటర్​ ఆపరేటర్​ కమ్​ అకౌంటెంట్లు 887 మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 10,769 మంది ఉండగా మిగతా వారు వివిధ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా సెలెక్షన్​ కమిటీ ద్వారా నోటిఫికేషన్ జారీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తమను ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, 18 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇంకా కాంట్రాక్టు​ ఉద్యోగులుగానే కొనసాగిస్తారని వాపోయారు.

మాపై వివక్ష ఎందుకు? 

గత బీఆర్ఎస్  ప్రభుత్వం సెర్ప్​ఉద్యోగులను రెగ్యులర్  చేసి పేస్కేల్​ వర్తింపజేస్తూ జీఓ జారీచేసినా గ్రామీణాభివృద్ధి శాఖలోనే పనిచేస్తున్న తమకు ఆ జీఓ వర్తింపజేయలేదని ఈజీఎస్​ ఉద్యోగులు తెలిపారు. ఇలా ఒకే డిపార్ట్​మెంట్​లో, ఒకే విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేస్తూ గత బీఆర్ఎస్  ప్రభుత్వం తమపై వివక్ష చూపిందన్నారు.  

పేస్కేల్​తోనే న్యాయం జరుగుతుంది  

మెదక్  జిల్లాలో 41 మంది కంప్యూటర్​ ఆపరేటర్లు, అకౌంట్​ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే రకమైన పనిచేస్తున్నా వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంది. పేస్కేల్​ వర్తింపజేస్తేనే వేతన వ్యత్యాసాలు తొలగిపోతాయి. అలాగే జిల్లాలో 12 మంది కంప్యూటర్​ ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్  ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిని కాంట్రాక్ట్​ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.

రాము, కంప్యూటర్​ ఆపరేటర్, అల్లాదుర్గం (మెదక్ జిల్లా)