ఎనిమిదిన్నర ఏండ్లయినా విభజన సమస్యలు తీరలే

ఎనిమిదిన్నర ఏండ్లయినా విభజన సమస్యలు తీరలే

ఇక మిగిలింది ఏడాదిన్నరే
కేంద్రం మీటింగ్​లు పెట్టి సూచిస్తున్నా పట్టించుకోని ఏపీ, తెలంగాణ
ఒకరు ఎస్​ అంటే మరొకరు నో 
సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

హైదరాబాద్​, వెలుగు : ఉమ్మడి ఏపీ విడిపోయి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు తీరడం లేదు. ఏపీ ఒకటంటే, తెలంగాణ మరొకటి అంటూ సమస్యను జటిలం చేస్తున్నాయి. కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏపీ పునర్​వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేండ్లలోనే విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. ఇప్పుడు ఏడాదిన్నర మాత్రమే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాదిలో తెలంగాణలో, ఆ తర్వాత ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కసారి ఎలక్షన్​ మూడ్​లోకి వెళితే విభజన పంచాయితీ రెండేళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అప్పట్లోగా చట్టం ఇచ్చిన సమయం ముగుస్తుంది. దీంతో మళ్లీ చట్ట సవరణ చేయాల్సి రావడంతో పాటు కొత్త చిక్కులు రావచ్చని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర హోం శాఖ విభజన చట్టం, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రాలు మొండిపట్టుతో వ్యవహరిస్తుండడంతో వివాదాలు పరిష్కారం కావడం లేదు.  

కోర్టు కేసులతోనూ ముందుకు పోతలే

కొన్ని అంశాలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం  కేసు వేసింది. 9వ షెడ్యూల్​లో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. డెక్కన్  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్  ల్యాండ్ హోల్డింగ్స్  లిమిటెడ్  (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి  తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్  తెచ్చుకుంది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌‌‌‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దానిని వ్యతిరేకిస్తూ ఏపీ కోర్టులో స్టే తీసుకుంది. పదో షెడ్యూల్లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​కు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన సంస్థలకు వర్తింపజేయాల్సి ఉంది.  దీనిపైనా రిట్​ పిటిషన్​ దాఖలైంది. దీంతో సంస్థల విభజన ముందుకు పోవడం లేదు. 

కరెంట్ ​బకాయిలు.. డిపాజిట్లపై అదే లొల్లి 

కరెంట్  బిల్లులపైనా రాష్ట్రాల మధ్య లొల్లి నడుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు పవర్ ​యుటిలిటీస్​ కింద రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని మన రాష్ట్రం చెబుతోంది. టీఎస్ జెన్​కో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు రూ.3,422 కోట్లు అని మన సర్కారు పేర్కొంది. విద్యుత్  రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్​ ఇవ్వలేదు. ఏపీ నుంచి  సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌‌‌‌ల విషయంలో రావాల్సిన రూ.495 కోట్లు పెండింగ్​లో ఉన్నాయని తెలంగాణ అంటోంది. హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ఉమ్మడి సంస్థలపై రూ.315 కోట్ల వరకు ఖర్చు చేసిన సొమ్ముపై ఏపీ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ తెలిపింది. నిర్మాణంలో ఉన్న భవనాల వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, ఇంకో రూ.208 కోట్లు ఏపీ చెల్లించాలని పేర్కొంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్, పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ వంటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్​ డెవలప్ మెంట్, టీఎస్ ఎంఎస్ఐడీసీ, మినరల్​ డెవలప్​మెంట్​ వంటి  ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్​అకౌంట్ల కింద ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు.

ఈ-సమీక్ష పోర్టల్ అప్​డేట్​ చేయని రాష్ట్రం

విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సినవి ఏ దశలో ఉన్నాయో సర్కారు ఈ–సమీక్ష పోర్టల్​లో అప్​డేట్ చేయడం లేదు. వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, ఐటీఐఆర్​తో పాటు ఎలక్ట్రానిక్ ​మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్స్, కొత్త ఎయిర్​పోర్టులు, ఐఐఎం ఏర్పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు కూడా ఉన్నాయి.

22 సంస్థలే కీలకం

విభజన చట్టంలోని 9వ షెడ్యూల్​లో మొత్తం 91 సంస్థల్లో  షీలా భిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై  భిడే కమిటీ రూపొందించిన సిఫార్సులను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. ఏపీ కూడా వాటిని అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నరు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్​లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ అడుగుతోంది. దీనికి మన రాష్ట్రం ఒప్పుకోవడం లేదు. ఇటీవల ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనిని తెలంగాణ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్ యూ ఫైన్​ ఆర్ట్స్​ వర్సిటీల విభజన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ట్యాక్స్ వసూళ్లు, వాటిని పంచుకోవడంలోనూ  రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నయి.