నేరేడుచర్లలో కంట్లో కారం కొట్టి పుస్తెలతాడు చోరీ

నేరేడుచర్లలో కంట్లో కారం కొట్టి పుస్తెలతాడు చోరీ
  • గుర్తుతెలియని మహిళ అఘాయిత్యం
  • సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల టౌన్ లో ఘటన

నేరేడుచర్ల, వెలుగు : వృద్ధురాలి కంట్లో కారం కొట్టి  పుస్తెలతాడును గుర్తు తెలియని మహిళ తెంపుకెళ్లిన  ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఎస్ఐ రవీందర్ కథనం ప్రకారం.. నేరేడుచర్ల టౌన్ కు చెందిన గుండా చంద్రకళ(62), ఇంట్లో ఉండగా గురువారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ వెళ్లి తాగేందుకు నీరు కావాలని  అడిగింది. ఆమె నీరు తెచ్చి ఇవ్వగా తీసుకుని తాగుతూ బాటిల్ మూతను కింద పడేయగా తీసేందుకు చంద్రకళ కిందకు వంగింది. 

ఆ వెంటనే వృద్ధురాలి కంట్లో మహిళ కారం కొట్టి మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంపుకుని పారిపోయింది. బాధితురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెళ్లి చంద్రకళ నుంచి వివరాలు సేకరించారు. స్థానికంగా తిరిగే మహిళపైనే అనుమానం ఉందని బాధితురాలు తెలిపింది. చంద్రకళ కొడుకు సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.