- మరో ఇద్దరికి అస్వస్థత
కందనూలు, వెలుగు: పూర్వం నుంచి నాటు మందు తయారుచేస్తున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పుల కోసం తయారు చేసిన నాటు మందును పరీక్షించే క్రమంలో తయారీదారుల్లోనే ఒకరు మృతిచెందారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ వృత్తి రీత్యా నాటు వైద్యం చేస్తుంటాడు. మోకాళ్ల నొప్పుల కోసం శుక్రవారం సాయంత్రం కొన్ని వనమూలికలు తీసుకొచ్చి మందు తయారు చేశాడు. దీని పనితీరు తెలుసుకునేందుకు ముందుగా వారి కుటుంబమే ప్రయత్నించింది.
నిరంజన్‌తో పాటు ఆయన భార్య చాన్ బి(65), కూతురు షమీనాకు కూడా మోకాలి నొప్పులు ఉండడంతో వారు తయారు చేసిన మందును వారే సేవించారు. అది వికటించడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చాన్ బి మృతిచెందారు. నిరంజన్, షమీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది.
