ఆస్తి పంచిచ్చినా.. ఒప్పుకున్న డబ్బులిస్తలేరు.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

ఆస్తి పంచిచ్చినా.. ఒప్పుకున్న డబ్బులిస్తలేరు.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

గద్వాల, వెలుగు: ఆస్తి పంచిచ్చినా.. పెద్ద కొడుకు, కోడలు ఒప్పుకున్న డబ్బులను తనకు ఇస్తలేరని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్ కు ఫిర్యాదు చేసి, గోడు వెల్లబోసుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల టౌన్ రివర్స్ కాలనీకి చెందిన శంకరమ్మ–వెంకట్రాములు దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వెంకట్రాములు గతంలోనే చనిపోయాడు. ఉన్న ఆస్తిని శంకరమ్మ తన ముగ్గురు సంతానానికి సమానంగా పంచింది. 

పెద్ద మనుషుల సమక్షంలో కుమారులు నెలకు రూ.10 వేలు, కూతురు రూ.2 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే పెద్ద కొడుకు, కోడలు గత కొంతకాలంగా శంకరమ్మకు డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. వీరిలో ఒకరు పరమాల, మరొకరు గోన్పాడులో టీచర్లుగా పని చేస్తున్నారని, వారి జీతంలో కోతపెట్టి తనకు అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని బాధితురాలు కలెక్టర్​ను వేడుకుంది.