బంధువుల కంటే స్నేహితులే కష్టకాలంలో సహాయపడతారు

బంధువుల కంటే స్నేహితులే కష్టకాలంలో సహాయపడతారు

కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయని పెద్దలు చెప్తుంటారు. పెద్దలు లేదా పండితులు.. ఒక మాట చెప్పారంటే అవి శిలాక్షరాలే. అందులో ఎటువంటి సందేహాలకు తావు ఉండదు. ఈ మాటలను మంచి, చెడు... రెండు సందర్భాలకు అన్వయించుకోవచ్చు. 

శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్యమిత్రులు. ఒకే గురువు దగ్గర విద్య అభ్యసించారు. చదువులు పూర్తయ్యాక వారి వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు రాజ్యపరిపాలన చేపట్టాడు. కుచేలుడు అధిక సంతానంతో ఆకలిబాధలు పడుతుంటే, అతని భార్య ‘మిత్రుడైన శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి సహాయం అర్థించమ’ని సూచించింది. ఆ ప్రకారమే కుచేలుడు తన కండువా చెంగున అటుకులు మూట కట్టుకుని శ్రీకృష్ణుడు నివసించే ద్వారకా నగరానికి చేరుకున్నాడు. స్నేహితుడికి శ్రీకృష్ణుడు సకల మర్యాదలు చేశాడు. విషయం తెలుసుకున్నాడు, అతడికి తగినంత సహాయం చేసి పంపాడు. భారతం కథలో దుర్యోధనుడికి ఆపద సమయంలో అనేకమార్లు కర్ణుడు సహాయం చేశాడు. అందుకే బంధువుల కంటే స్నేహితులే ఆపదలు వచ్చినప్పుడు, కష్టకాలంలోను సహాయపడతారని చెప్తారు.

ఇక ద్రోణాచార్యుడు, ద్రుపదుడి కథ చూస్తే ఇందులో మరో కోణం కనిపిస్తుంది. వీరిరువురూ ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. చదువు పూర్తయ్యాక వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ద్రుపదుడు రాజయ్యాడు. సిరిసంపదలతో పాటు అహంకారం కూడా పెరిగింది. ద్రోణాచార్యుడు మాత్రం కటిక పేదరికంతో బాధపడసాగాడు. తన మిత్రుడు తనకు ఏదైనా సహాయం చేస్తాడనే ఆశతో ద్రుపద మహారాజు దగ్గరకు వెళ్లాడు. అవమాన భారంతో వెనుదిరిగాడు. ప్రపంచంలో స్నేహితులలో ఈ రెండు రకాల వారు ఉంటారు.

ఇక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డల మనస్తత్వాలు బయటపడతాయి అనడానికి శ్రవణకుమారుడి కథ పెద్ద ఉదాహరణ. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని మోసేవాడు. వారికి వయోభారంతో పాటు, అంధత్వం కూడా ప్రాప్తించటం వల్ల, వారిని విడిచిపెట్టి వెళ్లడం అసాధ్యం. అందువల్ల కావడిలో వారిద్దరినీ చెరో పక్క కూర్చోపెట్టి, కావడిని భుజాల మీద మోసుకుంటూ ప్రయాణించేవాడు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

వృద్ధాప్యంలో పిల్లల మనస్తత్వం బయటపడుతుంది అనడానికి మరో ఉదాహరణ మహాభారతంలో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులంతా మరణించిన తరువాత, ధృతరాష్ట్రుడు, గాంధారి... పాండవుల సంరక్షణలో ఉంటారు. అంతకాలం ధృతరాష్ట్రుడు కౌరవుల పట్ల పక్షపాతం చూపుతూ, పాండవుల వినాశనాన్ని పరోక్షంగా కాంక్షించాడు. ధృతరాష్ట్రుని పట్ల మనసులో కోపంతో రగిలిపోతున్న భీముడు తరచుగా ధృతరాష్ట్రుడిని హేళన చేయటం ప్రారంభించాడు. అది కూడా ధర్మరాజు లేని సమయంలో ఆ విధంగా ప్రవర్తించాడు. భీముని మాటలకు ధృతరాష్ట్రుడు మనస్తాపం చెందేవాడు. ఆ మాటలను పడలేక, గాంధారి ధృతరాష్ట్రులు వానప్రస్థానికి వెళ్లి, అక్కడే తనువు చాలిస్తారు.

పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి అనటానికి కూడా భారత కథే మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. ధర్మరాజు శకునితో ఆడిన మాయాజూదంలో సర్వం కోల్పోతాడు. కట్టుబట్టలు మాత్రమే మిగులుతాయి. ఆ సమయంలో బలరాముని భార్య రేవతీదేవి... అర్జునుని పత్ని అయిన సుభద్రను అవమానిస్తుంది. ఆమె సూటిపోటిమాటలకు సుభద్ర మనసు బాధపడేది. 

సంపదలు పోతే బంధువులు ఈ విధంగా రాబందుల్లా మారతారా అని మనసులో దుఃఖిస్తుండేది. అదే సమయంలో శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి అనునిత్యం సుభద్రను, పాండవులను రక్షిస్తూనే ఉండేవారు. ద్రౌపదికి నిండు కొలువులో వలువలు ఊడదీసి, పరాభవం చేస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆమె మానం కాపాడాడు. పాండవులు లక్క ఇంటికి వెళ్లే సమయంలో సొరంగం తవ్వే వానిని పంపి, పాండవుల ప్రాణాలు కాపాడాడు. జరాసంధుడిని సంహరించవలసి వచ్చిన సమయంలో, గడ్డిపోచను రెండుగా చేసి, వాటిని అపసవ్య దిశలోకి పడేస్తూ, జరాసంధుడిని ఎలా చంపాలో సూచించాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుని రథసారథిగా ఉంటూ, ఎవరెవరిని ఏ విధంగా సంహరించాలో పరోక్షంగా సూచించి, ఆ యుద్ధంలో పాండవుల విజయానికి కారణమయ్యాడు. ఇలా... ప్రపంచంలో రెండు రకాల మనస్తత్వాలు గలవారు రామాయణ కాలం నుంచీ మనకు కనిపిస్తూనే ఉన్నారు.
-  డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232