నేటితో(నవంబర్ 28) ప్రచారానికి తెర .. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు బంద్​

నేటితో(నవంబర్ 28) ప్రచారానికి తెర .. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు బంద్​

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం తర్వాత  ప్రచారం బంద్ కానుంది. దీంతో అభ్యర్థులు అప్పుడే ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే చర్యలు చేపట్టారు.  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేసేందుకు.. ఒక్కో పార్టీ ఓటుకు రూ. 2 వేలు, రూ.3 వేలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.  అన్ని పార్టీలు డబ్బులు పంచే చర్యలు ముమ్మరం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు నుంచే బీఆర్ఎస్​ఓటర్ల జాబితాపై తీవ్ర కసరత్తు చేసింది. బూత్​ల వారీగా ప్రత్యేకంగా కొన్ని టీమ్​లను నియమించుకుని ఓటర్లకు స్లిప్పులు పంచడంతో పాటు, ఫోన్​ నెంబర్లను సేకరించుకుంది. 

ఇప్పుడు ఓటర్లకు నేరుగా ఫోన్​చేసి ఓటు తమకే వేయాలంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఫలానా వస్తువు మీకు అందిందా? ఫలానా కవర్​ అందిందా?  అంటూ ఓటర్లను అడుగుతుంది.  అపార్ట్​మెంట్ల కమిటీలకు ఫోన్ ​చేసి ఏదైనా సమస్య ఉందా?  మీ అపార్ట్​మెంట్​కు పెయింట్​వేయించమంటారా? అంటూ అడుగుతుంది.  బస్తీలు, కాలనీల సంఘాలకు ఫోన్లు చేసి అభ్యర్థులు.. మీ బస్తీ సమస్యలేంటి? వెంటనే పరిష్కరిస్తామని, యూత్​కు అవసరమైన క్రికెట్​కిట్, ఇతర ఆట వస్తువులు ఇస్తామని సూచిస్తున్నారు. బీజేపీకి చెందిన ఓ నేత ఓటర్లకు పంచడానికి తీసుకొచ్చిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోగా..  దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.  

స్థానిక నేతల చేతివాటం

ఓటర్లకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు స్థానిక నేతలకు కొంత మొత్తం ఇవ్వగా కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సగానికి పైగా వారే నొక్కేస్తున్నారు. దీంతో అభ్యర్థులకు అనుచరుల భయం కూడా వెంటాడుతుంది. అనుచరులే గోల్‌‌మాల్‌‌ చేస్తుండగా పంపిణీ సవాల్‌‌గా మారింది. ఇలాంటి ఘటనలు ప్రతి సెగ్మెంట్ లోనూ చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు మూడు అంచెల నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకుని ముఖ్య అనుచరుల నుంచి కార్యకర్తలు, ఓటర్లకు డబ్బు చేరే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అభ్యర్థుల గెలుపునకు కృషి చేసే కార్యకర్తలకు డబ్బులు చేరకపోతుండగా  గొడవలు జరుగుతున్నాయి.‘ కూకట్‌‌పల్లిలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తకు అభ్యర్థి రూ.5 లక్షలు ఇచ్చాడు. తన వద్ద ఉన్న డబ్బులో రూ.3 లక్షలు పంపిణీ చేశాడు. మిగతా రూ.2 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్టు తేలింది.  ఇదీ అభ్యర్థికి తెలియడంతో ఆరా తీశాడు.  అడిగితే అంతా ఓటర్లకు పంపిణీ చేశానని చెప్పాడు. దీంతో తన అనుచరుడు చెప్పేది నిజమో అబద్దమో తెలియక ఆ అభ్యర్థి అయోమయానికి గురయ్యాడు. ’

పోల్ మేనేజ్ మెంట్ పై ఫోకస్ 

ప్రచారానికి గడువు ముగుస్తుండగా పోల్ మేనేజ్ మెంట్ పై అభ్యర్థులు దృష్టి పెట్టారు. తమకు వ్యతిరేక పాంతాల్లోని ఓటర్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులను పంపిణీ చేసేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ప్రత్యేక టీమ్స్ ద్వారా గ్రౌండ్  లో  ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అభ్యర్థులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.  ప్రచారం కంటే పోల్ మేనేజ్ మెంట్ ఎంతో కీలకమని అన్ని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు.