వాలంటీర్ల సేవలు బంద్ - ఈసీ సంచలన నిర్ణయం...

వాలంటీర్ల సేవలు బంద్ - ఈసీ సంచలన నిర్ణయం...

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలు రద్దు చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించటంపై సిటిజన్స్ ఫర్ డెమాక్రసి సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించద్దని, అందుకు ప్రత్యామ్నాయాలను వాడుకోవాలని సూచించింది. వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

నగదుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవలంబిస్తున్న నగదు బదిలీ విధానం కానీ, రెగ్యులర్ ఉద్యోగులను వాడుకోవటం కానీ చేయాలనీ ఆదేశించింది. ఎన్నికల వేళ ఈసీ తీసుకున్న నిర్ణయం వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రంగా, వాలంటీర్ వ్యవస్థనే తమ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా భావిస్తున్న వైసీపీ శ్రేణులు ఈసీ నిర్ణయంతో అయోమయంలో పడ్డారు. దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని, వాలంటీర్ల సేవలు రద్దు అంశంపై ఈసీ తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.