బుర్ఖాలో వచ్చే మహిళల వెరిఫికేషన్ సరైనదే..ఎన్నికల సంఘం

బుర్ఖాలో వచ్చే మహిళల వెరిఫికేషన్ సరైనదే..ఎన్నికల సంఘం
  • 1994లోనే ఆ నిర్ణయం తీసుకున్నారు: ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: బిహార్ లో తర్వలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి బుర్ఖాలో పోలింగ్  కేంద్రాలకు వచ్చే మహిళల గుర్తింపును వెరిఫై చేయడం సరైనదేనని ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ కు ఈసీ గురువారం స్పందించింది.

 ఓటు వేయడానికి బుర్ఖా వేసుకుని వచ్చే మహిళల గుర్తింపును వెరిఫై చేయడం ఇప్పటి నిర్ణయం కాదని, టీఎన్  శేషన్  సీఈసీగా ఉన్నపుడే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ‘‘బుర్ఖా వేసుకున్న మహిళల గౌరవానికి, ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా వారి గుర్తింపును వెరిఫై చేయాలని 1994 అక్టోబర్ 21న ఈసీ గైడ్ లైన్స్  విడుదల చేసింది.

 అందుకోసం పోలింగ్  స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అదే నిర్ణయాన్ని ఇప్పుడు బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయబోతున్నాం. బుర్ఖా వేసుకున్న మహిళల గుర్తింపును వెరిఫై చేయడానికి పోలింగ్  కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. వారి పైరసీకి ఎలాంటి భంగం కలగకుండా చూస్తాం” అని ఈసీ వివరించింది.