
- ఆరేండ్లలో ఒక్క ఎలక్షన్లోనూ పోటీ చేయకపోవడంతో నిర్ణయం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన 13 రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వేటు వేసింది. అలాగే, దేశ వ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించినట్టు వెల్లడించింది. 2019 నుంచి ఇప్పటి వరకు.. ఆరేండ్ల కాలంలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా పార్టీలపై వేటు వేసిన విషయాన్ని సంబంధిత రాష్ట్రాల ఎన్నికల సంఘం కార్యాలయాలకు తెలిపింది. ఈ నిర్ణయం తర్వాత ప్రస్తుతంల మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాతీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి.
తెలంగాణలో తొలగించిన పార్టీలివే..
తెలంగాణలో తొలగించిన పార్టీల జాబితాలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైఖ్య సమితి పార్టీ, బహుజన సమాజ్ పార్టీ(అంబేద్కర్ -పూలే), ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, తెలంగాణ మైనార్టీ ఓబీసీ రాజ్యం, తెలంగాణ ప్రజా సమితి(కిషోర్, రావు అండ్ కిషన్), తెలంగాణ స్టూడెంట్స్ యూనైటెడ్ నేషన్ పార్టీ, యువ పార్టీ, యువ తెలంగాణ పార్టీ ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
అలాగే, పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి ఐదు పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఇందులో భారతీయ బహుజన ప్రజారాజ్యం, హిందుస్తాన్ రాష్ట్రీయ పార్టీ, జై భారత్ జనసేన పార్టీ, తెలుగు బహుజన పార్టీ, తెలుగు రాష్ట్రీయ శక్తి పార్టీలు ఉన్నాయి.