ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన ఎలక్షన్ కమిషన్

ఎన్నికల ప్రక్రియను  స్పీడప్ చేసిన ఎలక్షన్ కమిషన్
  • అక్టోబర్ 3 నుంచి 5 దాకా పర్యటన
  • ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ చేయనున్న సీఈసీ
  • వివిధ శాఖల అధికారులతోనూ భేటీలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ స్పీడప్ చేసింది. త్వరలో అసెంబ్లీ గడువు ముగియనున్న పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసిన ఈసీ టీమ్​.. ఇప్పుడు మూడు రోజుల తెలంగాణ పర్యటనకు రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిషనర్లు, ఉన్నతాధికారులతో కూడిన  17 మంది సభ్యుల బృందం అక్టోబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుంది.

ఫస్ట్ డే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను రివ్యూ చేయడంతోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఎక్సైజ్, ఆదాయ పన్ను, జీఎస్టీ, రవాణా, నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతోనూ భేటీ సమావేశం కానుంది. డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించనుంది.

Also Raed : మహిళా రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​

రెండో రోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్‌ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనుంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు తెలంగాణ రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు. ఓటర్లకు చైతన్యం కల్పించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుంటారు.

కొన్ని ప‌నుల పూర్తికి డెడ్‌లైన్!

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం అక్టోబర్ 3 నుంచి 5 వరకు ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు చెందిన అన్ని అంశాల‌ను ఈసీ బృందం ప‌ర్యవేక్షించ‌నున్నది. కొన్ని ప‌నులు పూర్తి చేయ‌డానికి డెడ్‌లైన్ విధించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒకవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండటం, పార్లమెంట్ సెషన్​లో మాత్రం ఇంకా ఎలాంటి ప్రస్తావన రాకపోవడం, ఇంకోవైపు ఎలక్షన్ ప్రాసెస్ స్పీడప్ చేయడంతో రెగ్యులర్ టైంలోనే ఎన్నికలు జరుగుతాయని చర్చ జరుగుతున్నది. గతంలో2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై అక్టోబ‌ర్ ఆరో తేదీన ఈసీ ప్రక‌ట‌న చేసింది. న‌వంబ‌ర్ 12న నోటిఫికేష‌న్ జారీ చేసింది. డిసెంబ‌ర్ 11వ తేదీన పోలింగ్ జ‌రిగింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం జ‌న‌వ‌రి 17వ తేదీన ముగియ‌నున్నది.

ఈవీఎం నోడల్ ఆఫీసర్లకు, ఐటీ సిబ్బందికి ట్రైనింగ్​

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా ఎన్నికల విధులు నిర్వర్తించే ఈవీఎం నోడల్ అధికారులు, ఐటీ సిబ్బందికి సీఈఓ ఆఫీస్​లో మంగళవారం ట్రైనింగ్ ఇచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్​లు, యంత్రాల నిర్వహణ, ఓటింగ్‌కు ముందు, ఓటింగ్ సమయంలో, ఓటింగ్ పూర్తయిన తర్వాత వాటిని నిర్వహించే పద్ధతులు, ప్రక్రియలపై సీనియర్​ అధికారులతో పాటు ఓటింగ్ యంత్రాల తయారీ సంస్థ అయిన ఈసీఐఎల్‌కు చెందిన ఇంజనీర్లు అవగాహన కల్పించారు