హరీశ్ వల్లే రైతు బంధు ఆగింది.. ఎన్నికల కమిషనే​ ఆ విషయాన్ని చెప్పింది: కాంగ్రెస్

హరీశ్ వల్లే రైతు బంధు ఆగింది.. ఎన్నికల కమిషనే​ ఆ విషయాన్ని చెప్పింది: కాంగ్రెస్
  • హరీశ్​ కోడ్​ను ఉల్లంఘించారు: మల్లికార్జున ఖర్గే
  • రైతులకు మేలు చేయాలని మామా అల్లుళ్లకు లేదు: రేవంత్​
  • రైతులకు ఇది బీఆర్​ఎస్​ శాపమే: కేసీ వేణుగోపాల్​
  • మూడేండ్లలో ఏనాడూ నవంబర్​లో వేయలేదు: కోదండరెడ్డి
  • గాంధీభవన్​ ముందు కేసీఆర్, హరీశ్​ దిష్టిబొమ్మల దహనం

హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్​ రావు వల్లనే రైతుబంధు పంపిణీని ఎన్నికల కమిషన్​ నిలిపివేసిందని కాంగ్రెస్​ పేర్కొంది. ఇదే విషయాన్ని ఈసీ స్పష్టంగా చెప్పిందని వివరించింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు గురించి అనవసరంగా హరీశ్​ మాట్లాడి రైతులను ముంచారని మండిపడింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే విడుదల చేస్తామని తెలిపింది. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, కిసాన్​ సెల్  నేతలు రైతుబంధుపై సోమవారం స్పందించారు.  కేసీఆర్​, హరీశ్​ రావు తీరును నిరసిస్తూ వారి దిష్టిబొమ్మలను గాంధీభవన్​ ముందు కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు ఎ. కోదండ రెడ్డి, మీడియా ఇన్​చార్జ్​ అజయ్​ కుమార్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నేతలు దహనం చేశారు. 

ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారు: ఖర్గే

ఎన్నికల కోడ్​ను మంత్రి హరీశ్​రావు ఉల్లంఘించారని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. రైతుబంధును కాంగ్రెస్​ ఆపించిందంటూ కేసీఆర్​ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కమిషనే రైతు బంధు పథకాన్ని నిలపుదల చేసిందని, నోటిఫికేషన్​ కన్నా ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కాంగ్రెస్​ పార్టీ కోరిందని తెలిపారు. రైతులకు కాంగ్రెస్​ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

బీఆర్​ఎస్​ నేతల బాధ్యతారహిత కామెంట్లే కారణం: కేసీ వేణుగోపాల్

ఎన్నికల కమిషన్​ రైతు బంధును నిలిపేయడం రైతులకు అక్షరాలా బీఆర్​ఎస్​ పెట్టిన శాపమేనని ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ అన్నారు. కేసీఆర్​ ఆదేశాల మేరకే మంత్రి హరీశ్​రావు, బీఆర్​ఎస్​ పార్టీ నేతలు బాధ్యతా రహితంగా వ్యవహరించారని, అందువల్లే ఈసీ రైతుబంధు పంపిణీని నిలిపేసిందని పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల హక్కు అని, ఏడాది కష్టానికిగానూ వారికి దక్కాల్సిన ప్రతిఫలమని చెప్పారు. అక్టోబర్​ నుంచి జనవరి మధ్య రైతుబంధు డబ్బులను ఎప్పుడైనా రిలీజ్​ చేసే అవకాశం ఉన్నా.. బీఆర్​ఎస్​ సర్కారు నిర్లక్ష్యం, బాధ్యతా రహితమైన కామెంట్ల వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందన్నారు.  

రైతులెవరూ ఆందోళన చెందొద్దు: రేవంత్ 

రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. నిజంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశం మామా అల్లుళ్లు కేసీఆర్​, హరీశ్​రావుకు లేదని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు.  రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని హరీశ్​ రావు వ్యాఖ్యల వల్లే ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

ఇలాంటి ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని, అందరికీ ఎకరాకు రూ.15 వేలు జమచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హరీశ్​ రావు కామెంట్లతోనే రైతుబంధు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ఈసీ స్పష్టంగా చెప్పిందని ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి అన్నారు. తాము రైతుల పక్షానే ఉంటామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  

అక్టోబర్​లోనే రైతుబంధు వేయాల్సింది: కోదండ రెడ్డి

రైతుబంధు పేరుతో ఎన్నికల్లో గెలవాలని బీఆర్​ఎస్​ సర్కారు కుట్రలకు తెరలేపిందని, ప్రభుత్వ సొమ్మును వాడుకోవాలనుకున్నదని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల టైంలోనూ ఇలాగే చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకున్నారని విమర్శించారు. అక్టోబర్​ 1న రబీ సీజన్​ ప్రారంభమవుతుందని, అప్పుడే రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేయాల్సిందని అన్నారు. మూడేండ్ల నుంచి ఏనాడూ బీఆర్​ఎస్​ సర్కారు నవంబర్​లో రైతుబంధు పంపిణీ చేయలేదని, డిసెంబర్​ చివరి వారంలోనే మొదలుపెట్టేవారని తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రైతుబంధును రైతుల ఖాతాల్లో వేస్తుందని అన్నారు.

రేవంత్  పేరిట ఫేక్​ లెటర్​

రైతుబంధును ఆపించాలంటూ ఎన్నికల కమిషన్​కు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రాసినట్టుగా ఓ ఫేక్​ లెటర్​ సర్క్యులేట్​ అవుతున్నది. హరీశ్​ రావు కామెంట్లను దృష్టిలో పెట్టుకుని రైతుబంధును నిలిపేయాలని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని అందులో ఉంది. అయితే, అది ఫేక్​ లెటర్​ అని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. 

సోషల్​ మీడియాలో బీఆర్​ఎస్​ పార్టీనే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీఆర్​ఎస్​ దిగజారిపోయి ఇలాంటి ఫేక్​ ప్రచారాలకు పాల్పడుతున్నదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిని, డీజీపీని  కోరారు.