ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడే

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడే

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్​లో జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ ఉంటుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్లు లెక్కించి, గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తారు. ఈ ఎన్నికలో ఓటు వేసేందుకు లోక్ సభ, రాజ్యసభ ఎంపీలందరూ అర్హులే. మొత్తం 788 మంది ఓటు వేయనున్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒక్కటని ఎలక్షన్ కమిషన్(ఈసీ) తెలిపింది. పోలింగ్​కు సంబంధించి తమ ఎంపీలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదని చెప్పింది. ఈ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా బెంగాల్​ మాజీ గవర్నర్​జగదీప్ ధన్ కర్.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాజస్థాన్​ మాజీ గవర్నర్​ మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు. జేడీయూ, వైఎస్సార్​సీపీ, బీఎస్పీ, అన్నాడీఎంకే సహా పలు ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో ధన్​కర్​ సుమారు 515 పైచిలుకు ఓట్లు సాధించనున్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు, ఆప్, జేఎంఎం, ఎంఐఎం, టీఆర్​ఎస్ తదితర ప్రాంతీయ పార్టీలు మద్దతు పలికిన మార్గరెట్​ అల్వా ఈ ఎన్నికలో 200 పైచిలుకు ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రతిపక్ష కూటమి తనను సంప్రదించకపోవడంతో ఎన్నికల ఓటింగ్​కు దూరంగా ఉండనున్నట్లు టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు.