లెక్కతప్పితే తిప్పలే..

లెక్కతప్పితే తిప్పలే..
  • ఉమ్మడి జిల్లాకు ముగ్గురు అబ్జర్వర్లు
  • ఎన్నికల్లో మితిమీరిన వ్యయంపై సీరియస్
  • అభ్యర్థులకు నోటిసులు జారీ

వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి రూ.40 లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ నిబంధనలు పాటించని వారికి ఎలక్షన్  కమిషన్ నియమించిన అబ్జర్వర్లు చెమటలు పట్టిస్తున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్  ఆఫీసర్లు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి రోజూ తమ  ఖర్చుల వివరాలు అబ్జర్వర్లకు సమర్పించాలి. లేకుంటే ఈసీ వారికి నోటీసులు జారీ చేస్తుంది. 

అలాగే లెక్కల్లో గోల్​మాల్  చేస్తున్నట్లు కనిపిస్తే వీరు అంగీకరించడం లేదు. నిబంధనల మేరకు నామినేషన్  వేసిన రోజు నుంచి ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చేంత వరకు ఖర్చు రూ.40 లక్షలు దాటవద్దు. అయితే అన్ని రాజకీయ పార్టీలు ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీలతో హంగామా చేస్తున్నారు. ఆ తరువాత ప్రచారంలో పాల్గొనే వారికి కూలీతో పాటు బోజనాలు, ఇతరత్రా మర్యాదలు చేస్తున్నారు. 

వీటిఫై నిఘా పెట్టేందుకు ఎన్నికల కమిషన్  ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వాహనాలను గ్రామాల్లో తిప్పుతోంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్న వారి స్పీడ్ కు ఎన్నికల అబ్జర్వర్లు బ్రేకులు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున ఐఏఎస్, ఐపీఎస్  అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లుగా నియమించింది. వీరిలో ఒకరు పోలీసు అబ్జర్వర్, మరొకరు జనరల్ అబ్జర్వర్, మూడోవారు ఎక్స్​పెండీచర్ అబ్జర్వర్లు ఉన్నారు. వీరు ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేస్తూ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిఘా ఏర్పాటు చేశారు. 

మూడు దశల్లో నిఘా..

ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అబ్జర్వర్లు మూడు దశల్లో అభ్యర్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. ఒకటి డబ్బు, మద్యం, ఇతర సామాగ్రిని ఓటర్లకు పంచి ప్రలోభాలకు గురి చేయకుండా చూస్తున్నారు. అన్నిజిల్లాల్లో ప్రత్యేకంగా పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖర్చుల అబ్జర్వర్  ఎన్నికల ప్రచారం సందర్భంగా చేస్తున్న ఖర్చులను అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతూ సీసీ కెమెరాల్లో ప్రచారాన్ని రికార్డు చేస్తున్నారు. 

ఎన్ని వాహనాలు వాడుతున్నారు? ఎంత మందితో ర్యాలీ నిర్వహిస్తున్నారు? ప్రచార సామగ్రికి ఎంత ఖర్చు చేస్తున్నారు? భోజనాలు ఎంత మందికి పెడుతున్నారనే అంశాలపై దృష్టి పెడుతున్నారు. జనరల్ అబ్జర్వర్  ఈ రెండు అంశాలతో పాటు ఇతర అంశాలను పరిశీలిస్తూ అభ్యర్థుల సంబంధించిన ఎన్నికల ఏజెంట్ల ముందు ప్రతి రోజూ ఖర్చుల వివరాలు చూపుతున్నారు. దీనిపై అభ్యర్థుల ఏజెంట్ల నుంచి వివరణ కోరుతున్నారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్  అధికారి సమక్షంలో రోజువారీ లెక్కలు తేల్చి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తున్నారు. లెక్కలు చూపకున్నా, తేడాగా వివరాలు ఉన్నా అభ్యర్థికి నోటీసులు జారీ చేస్తున్నారు. 

వీరి నోటీసులకు స్పందించకుంటే అభ్యర్థి అభ్యర్థిత్వం క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు వణికిపోతున్నారు. నామినేషన్  డిపాజిట్ తో పాటు ప్రతిరోజు పత్రికలు, టీవీల్లో వచ్చిన ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్  వంటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. నిబంధనలు పాటించని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనుమతి తీసుకున్న ప్రచార వాహనాల కంటే ఎక్కువ కనిపిస్తే వాటిని సీజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వాటికి ఛార్జ్  వేసి అభ్యర్థి ఖర్చు కింద చూపుతుండడంతో క్యాండిడేట్లు హడలిపోతున్నారు. ప్రతి అభ్యర్థి తన క్రిమినల్ నేపథ్యాన్ని ఆయా పత్రికల్లో ప్రకటనల రూపంలో  ఓటర్లకు మూడు సార్లు తెలియజేయాల్సి ఉంది. ఇందుకు అయ్యే ప్రకటన ఖర్చులు కూడా అభ్యర్థి ఖాతాలోనే జమవుతాయి.  

నోటీసుల జారీతో హైరానా..

ఉమ్మడి జిల్లాలో ఖర్చుల వివరాలు ఇవ్వని అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. వనపర్తి బీజేపీ అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి లెక్కలు చూపలేదని అతని ప్రచార వాహనాలను సీజ్  చేస్తామని ఎన్నికల పరిశీలకుడు నోటీసులు జారీ చేశారు. అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, గద్వాల జిల్లాలోని అభ్యర్థులకు నోటీసులు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీ పత్రిక పాజిటివ్  కథనాలపై కూడా నోటీసులు జారీ చేశారు. 

దీంతో ఎన్నికల అధికారుల నిఘాపై చర్చ జరుగుతోంది. పక్కాగా లెక్కలు చూపాల్సిందేనని అబ్జర్వర్లు చెబుతున్నారు. ఎక్కువ ఖర్చు చేస్తే మాత్రం ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమ చేసి దానిని మూసేస్తామని, ఇక ఖర్చు చేసేందుకు ఉండదని చెబుతున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే చాలా మంది అభ్యర్థుల ఖర్చు రూ.30 లక్షలు దాటింది. ఎన్నికలకు మరో పది రోజులు ఉండడం, ఖర్చులు ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బు, మద్యం పంచుతూ దొరికితే చర్యలు సీరియస్ గా ఉంటాయని ఎలక్షన్  అబ్జర్వర్లు హెచ్చరిస్తున్నారు.