బల్దియాలో మూడేండ్లైనా ఎన్నికల్లేవ్!

బల్దియాలో మూడేండ్లైనా ఎన్నికల్లేవ్!
  •     మేయర్ కౌన్సిల్ ఏర్పాటైనా ఇంకా పెండింగ్
  •     చట్ట సవరణ పేరుతో పట్టించుకోని గత సర్కార్  
  •     ఖాళీగా ఉన్న మూడు డివిజన్లకు ఎన్నికలెప్పుడో..?
  •     కొత్త సర్కార్ ఆదేశాలకు అధికారులు వెయిటింగ్ 

హైదరాబాద్, వెలుగు: బల్దియాలో ఖాళీగా ఉన్న డివిజన్లలో ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం 3 డివిజన్లకు నిర్వహించాల్సి ఉంది. గుడిమల్కాపూర్ కార్పొరేట్ దేవర కరుణాకర్ ఏడాది కింద గుండెపోటుతో మృతి చెందారు.  ఇప్పటికీ ఎన్నిక నిర్వహించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ నుంచి శాస్ర్తిపురం కార్పొరేటర్ ముబీన్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆయా చోట్ల కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

వీటితో పాటు కో ఆప్షన్, వార్డు కమిటీల నియామకాలు పెండింగ్ లోనే ఉన్నాయి. మొన్నటి దాకా బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఆ ప్రక్రియను పట్టించుకోలేదు. చట్ట సవరణ తర్వాత సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతోనే నిర్వహించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. వీటితో పాటు రెండో స్టాండింగ్ కమిటీ గడువు ఈ ఏడాది అక్టోబర్​లోనే ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా మూడో స్టాండింగ్ కమిటీ ఎన్నిక కూడా జరగలేదు.   

చట్ట సవరణ చేసినా..  

బల్దియా ఎన్నికలు జరిగిన మూడేళ్లు కావొస్తుంది. మరో రెండేళ్లు  మాత్రమే కౌన్సిల్ గడువు ఉంది. కానీ, కో ఆప్షన్  సభ్యుల నియామకం నేటికీ చేపట్టలేదు. 2021 మార్చి 24న  నోటిఫికేషన్ ఇచ్చినా.. మరుసటి రోజే ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి నేటికీ ఇవ్వలేదు. బల్దియాలో కో ఆప్షన్ సభ్యులను గతంలో 5 మంది స్థానంలో 15 మందిని నియమించే విధంగా చట్ట సవరణ చేశారు. ఇందుకు సంబంధించిన అప్రూవల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో  నియామకం పెండింగ్​లో పడిందని అధికారులు అంటున్నారు. 3 నెలల లోపు జరగాల్సిన నియామకం మూడేళ్లు కావొస్తున్నా చేపట్టలేదు.  

ఎన్నుకోవాల్సి ఉన్నా పట్టించుకోవట్లే..

కౌన్సిల్ ఏర్పాటైన మూడు నెలల్లోపు వార్డు కమిటీలను నియమించాలి. ఇందుకు డివిజన్లలోని ఆయా కాలనీల్లో ఉంటే సీనియర్ సిటిజన్లు, యువత, అసోసియేషన్స్, సొసైటీ,  వార్డు కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఏడాదిన్నర దాటినా  అడుగు ముందుకు పడలేదు.  గ్రేటర్‌లో 150 వార్డులుండగా.. ఒక్కో వార్డు కమిటీలో100 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తంగా15 వేల మంది సభ్యులను నియమించాల్సి ఉండగా.. ప్రతిసారి నామమాత్రంగా 10 నుంచి 15 మందిని ఎన్నుకుంటున్నారు. దీంతో కమిటీ లక్ష్యం నెరవేరడంలేదు. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్,  ఆదేశాల కోసం బల్దియా అధికారులు ఎదురుచూసే పరిస్థితి ఉంది.