నామినేటెడ్ ​కమిటీ రద్దవడంతో త్వరలో ఎలక్షన్స్!

నామినేటెడ్ ​కమిటీ రద్దవడంతో త్వరలో ఎలక్షన్స్!
  • ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని పార్టీలు..
  •  పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్​ ఫోకస్​
  •  గెలుపే లక్ష్యంగా  అధికార టీఆర్ఎస్​ ఎత్తులు..
  •  పాతవారికే అవకాశం ఇస్తారని  జోరుగా చర్చ

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ(సెస్) ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండడంతో జిల్లాలో పొలిటికల్​ హీట్​మొదలైంది. నవంబర్​లో  ఎన్నికలుంటాయని తెలుస్తుండడంతో రాజకీయ పార్టీలు అలర్ట్​ అవుతున్నాయి.  కొందరు లీడర్లు  ఇప్పటికే  తాము పోటీలో ఉంటున్నట్లు ప్రకటించుకుంటున్నారు.  అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టడమే కాకుండా సెస్‌‌లో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్‌‌, బీజేపీ ఆరాట పడుతున్నాయి. ప్రభుత్వం వేసిన నామినేటెడ్​ కమిటీ రద్దు కావడంతో తిరిగి నేతలు సెస్‌‌ను దక్కించుకోవడం సవాల్‌‌గానే మారింది. దీంతో  ఏకగ్రీవాలపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.  జిల్లాలోని అన్ని గ్రామాలు, మానుకొండూర్, చొప్పదండి నియోజక వర్గాల్లోని  కొన్ని గ్రామాలు ‘సెస్’ పరిధిలో  ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ దూకుడు మీద ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు. 

ఎవరి ధీమా వారిదే..

ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆర్డర్స్​ ఇవ్వడంతో  అధికార టీఆర్ఎస్​తో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు గెలుపు ధీమాతో ఉన్నాయి. ఆర్థికంగా, సమాజంలో పలుకుబడి ఉన్న అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇటీవల సిరిసిల్ల లో జరిగిన కాంగ్రెస్  విస్తృత స్థాయి సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​‘సెస్’ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల నియోజక వర్గంలోని మండలాల్లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఎక్కడెక్కడ ‘సెస్​’ డైరెక్టర్లుగా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటారో అక్కడే పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. బీజేపీ నాయకులు సెస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే    కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్  సిరిసిల్లలో  సెస్ ఎన్నికల పై పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు నాయకులు చెప్తున్నారు.  

ప్రవీణ్​కే అవకాశం..!

కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గూడూరి ప్రవీణ్​ ‘సెస్’ చైర్మన్ పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలల్లోనే  కోర్టు ఆర్డర్స్​తో పదవిని  కోల్పోయాడు.  పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ ​ప్రస్తుతం టీఆర్​ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న గూడూరికి ఏ పదవీ కలసి వస్తలేదు. ఆయన గత ప్రభుత్వాల హయాంలో సెస్ వైస్ చైర్మన్ గా,అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా  పని చేశారు. టీడీపీ  నుంచి టీఆర్​ఎస్ చేరినప్పటి నుంచి గూడూరికి ఏ పదవి దక్కలేదు. దీంతో కేటీఆర్ గత ఏప్రిల్ సెస్ చైర్మన్ పదవి ఇచ్చినా.. అది రెండు నెలలకే రద్దు కావడంతో మళ్లీ ఆయనకే టికెట్​ఇస్తారనే చర్చ సాగుతోంది.

మంత్రి గ్రీన్​సిగ్నల్​ కోసం వెయిటింగ్​

సిరిసిల్ల ఎన్నికలను ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిద్ధమవుతుండగా, అధికార టీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో భారీగా ఆశావహులు ఉండటంతో ‘సెస్’ డైరెక్టర్ టికెట్ ఎవరికి దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. పాత కమిటీ సభ్యులు రెండు నెలలు మాత్రమే పదవిలో ఉండడంతో తిరిగి వారికే మళ్లీ అవకాశం ఇస్తారనే  చర్చ జోరుగా సాగుతోంది.